సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో నేరాలు చేసి తప్పించుకోవాలని చూస్తున్న నేరగాళ్లు ఎక్కడున్నా పోలీసులు పట్టుకుంటున్నారు. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయి దొంగలను సైతం పట్టుకుని హైదరాబాద్ పోలీసులు సత్తా చూపిస్తున్నారు. దొంగతనాలు, దోపిడీలు, స్నాచింగ్లకు సంబంధించిన వ్యవస్థీకృత నేరాలు, సంచలనం సృష్టించిన కేసులను ఈ ఏడాది 100 శాతం ఛేదించే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఆశించిన స్థాయిలో విజయాలను కూడా సాధిస్తూ నగర ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. జూలై 20న నగరంలో 15 స్నాచింగ్లు జరుగగా.. 14 కేసులను, 60 వరకు సెల్ఫోన్ స్నాచింగ్లు జరుగగా.. అందులో 58 కేసులను ఛేదించారు. సంచలనం సృష్టించిన దొంగతనాలు, దోపిడీ కేసులను సైతం 100 శాతం ఛేదించారు. ఆస్తి నష్టానికి సంబంధించిన కేసుల్లో నేరస్థులు ఎక్కడున్నా గుర్తించి పట్టుకునే టెక్నాలజీ హైదరాబాద్ పోలీసుల వద్ద ఉంది. దీంతో ఆయా కేసులను వెంటనే ఛేదిస్తున్నారు. ఈ విజయంలో శాంతి భద్రతల పోలీసులకు కొండంత అండగా టాస్క్ఫోర్స్ పోలీసులుంటున్నారు. ఒక నేరం జరిగిందంటే ముందుగా నేరస్థులను పట్టుకునేందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి, వేట మొదలు పెడుతున్నారు.. గంటల వ్యవధిలోనే ఎక్కడున్నా గుర్తించి పట్టుకుంటున్నారు.
అంతర్రాష్ట్ర దొంగలకు చెక్..
అంతర్రాష్ట్ర దొంగలు హైదరాబాద్ వైపు రాకుండా పోలీసులు కట్టడి చేశారు. అన్నిమార్గాలపై నిఘా పెంచారు. పట్టుబడిన నేరగాళ్ల పాత చరిత్రను తోడి, పీడీ యాక్టులు నమోదు చేస్తూ జైలు నుంచి బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అంతర్రాష్ట్ర దొంగల్లో వణుకు మొదలై హైదరాబాద్ వైపు చూడాలంటేనే భయపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్లో ఉన్న సీసీ కెమెరాలు, ముమ్మర పెట్రోలింగ్, పోలీసుల పటిష్ట నిఘాతో నేరాలు చాలా వరకు తగ్గాయి. నేరం జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు నేరం జరిగినా వెంటనే రంగంలోకి దిగి టెక్నాలజీ సహాయంతో నేరగాళ్లను గుర్తించి పట్టుకుంటున్నారు.
పోలీసులకు సమాచారం ఇవ్వడమే ఆలస్యం..!
దొంగతనం, దోపిడీ, స్నాచింగ్ వంటి ఘటనలు జరిగాయంటే బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీసులకు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంతే వేగంగా దొంగలను పట్టుకునే అవకాశం ఉంటుంది. ఫిర్యాదు రాగానే ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించడం, ఆ ఘటనపై అధ్యయనం చేస్తున్న పోలీసులు ఒక అంచనాకు వచ్చి వెంటనే నేరస్థులను పట్టుకోవడానికి అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధిస్తున్నారు.