హైదరాబాద్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ) : ఎన్నికలు ఏవైనా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. ఎన్నికలప్పుడు ఇచ్చిన 420 హామీల్లో ఒక్క మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏదీ అమలుచేయని ఆ పార్టీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే గిగ్ వర్కర్ల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. రెండేళ్లుగా వారి గురించి పట్టించుకోని రేవంత్ సర్కారు.. ఇప్పుడు మాత్రం గిగ్ వర్కర్ల సంక్షేమానికి త్వరలో ఓ కొత్త చట్టాన్ని తెస్తామని ప్రకటించింది. సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీనే ఇప్పటికీ అమలుచేయని సర్కారు, తాజాగా గిగ్ వర్కర్ల చట్టాన్ని ఎన్నిక కాగానే నవంబర్ 12న కేబినెట్లో ఆమోదిస్తామని చెప్పడం ఎన్నికల స్టంటేనని.. మళ్లీ వంచించే కుట్రేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ప్రభుత్వ అంచనా ప్రకారం రాష్ట్రంలో ఫుడ్ డెలివరీ, రైడ్-షేరింగ్, లాజిస్టిక్స్, ఈ-మార్కెట్ ప్లేస్ సేవలు తదితర వాటిల్లో 4 నుంచి 4.5లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. రోజుకు 12నుంచి 18గంటల పాటు నిరంతరం పనిచేస్తున్నా వారికి దక్కేది రోజుకు రూ.1000-1200 మాత్రమే. అందులో పెట్రోల్, ఇతర ఖర్చులు పోగా మిగిలేది కేవలం రూ. 500లోపే. ఒకవేళ డెలివరీ సందర్భంగా ఏదైనా ప్రమాదం జరిగితే కంపెనీ ఎలాంటి బాధ్యత తీసుకోదు. దీంతో దినదినగండంగా బతుకులు వెళ్లదీస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమం, భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు రాజస్థాన్ తరహా ప్రత్యేక చట్టాన్ని తెస్తామని ఎన్నికలప్పుడు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే, రెండేళ్లు కావస్తున్నా అది అమలుకు నోచుకోలేదు.
ఇతర హామీల వలే అదికూడా గాలికి కొట్టుకుపోయింది. గిగ్ వర్కర్ల సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో హడావుడి చేసినా అది ఇంకా అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కస్టమర్ల నుంచి వసూలు చేసే చార్జీల్లో 1-2శాతం అదనంగా వసూలు చేసి ఆ మొత్తాన్ని వారి సంక్షేమానికి వినియోగించాలనేది ఇందులో ముఖ్యమైన ప్రతిపాదన. దీన్ని బట్టి గిగ్ వర్కర్ల సంక్షేమంపై కాంగ్రెస్ నేతలు ఇచ్చే హామీల్లో ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.

జూబ్లీహిల్స్ ఎన్నికల స్టంట్
గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం త్వరలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఈ నెల 12న జరిగే క్యాబినెట్ సమావేశంలో సంబంధింత బిల్లు ఆమోదం పొందుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం వెల్లడించారు. అకస్మాత్తుగా కొందరు గిగ్ వర్కర్లను సచివాలయానికి పిలిపించుకొని మంత్రి వారితో సమావేశమయ్యారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ, కేబినెట్ ఆమోదం తర్వాత బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈ కొత్త చట్టంతో గిగ్ వర్కర్లకు భద్రత, హక్కులు, సామాజిక రక్షణ వంటి సదుపాయాలు కలుగుతాయని చెప్పారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ నెల 11తో ముగుస్తున్న విషయం విదితమే. రెండేళ్లుగా అమలు చేయని హామీ ఇప్పుడే గుర్తుకు రావడం, అదికూడా మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయనగా హడావిడిగా తెరపైకి తీసుకురావడం అనుమానాలకు తావిస్తున్నది. దాదాపు నాలుగున్నర లక్షల గిగ్ వర్కర్ల కుటుంబాలను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ ఒక ఎన్నికల స్టంట్‌గా చేస్తున్నది తప్ప మరొకటి కాదని రాజకీయ వర్గాలు అభిప్రాయ
పడుతున్నాయి.
ఇదీ రాహుల్‌గాంధీ రెండేళ్ల నాటి హామీ
నవంబర్ 27, 2023న రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం సందర్భంగా హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్లు, శానిటరీ వర్కర్లు, గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మరో వారమైతే ఆయన హామీ ఇచ్చి సరిగ్గా రెండేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రతి ఆటో డ్రైవర్‌కూ రూ.12వేల చొప్పున ఇవ్వడంతో పాటు పెండింగ్ చలాన్లను 50శాతానికి తగ్గిస్తామని, సింగిల్ పర్మిట్ పాలసీని ప్రవేశపెడుతామని హామీ ఇచ్చారు. రాజస్థాన్ తరహా గిగ్ వర్కర్ల చట్టాన్ని తెలంగాణలో కూడా ప్రవేశపెడుతామని, తద్వారా వారి సంక్షేమం, భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని ప్రకటించారు. గిగ్ వర్కర్ల ప్రస్తుత స్థితి ‘21వ శతాబ్దపు బానిసత్వం’ మాదిరిగా ఉన్నదని, కంపెనీలు ప్రయోజనం పొందుతున్నా డెలివరీ కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లభించడం లేదని ఆయన పేర్కొన్నారు.