సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. పారిశుధ్యాన్ని మెరుగుపరిచే విధంగా మంగళవారం నుంచి ప్రారంభించిన ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను కమిషనర్ చార్మినార్, ఎల్బీనగర్ జోన్‌లోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రోడ్లు, కాలనీలు, బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని పారిశుధ్య కార్మికులు తొలగించారు.
మురుగు కాల్వలను శుభ్రం చేసి నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నారు. దోమల బెడదను నివారించడానికి ఎంటమాలజీ అధికారులు ఫాగింగ్, యాంటీలార్వా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా చెత్త బుట్టల్లోనే వేయాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ డ్రైవ్‌లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు కూడా పాల్గొని తమ వంతు సహాయాన్ని అందించి కాలనీ పరిశుభ్రతకు దోహదపడే విధంగా తమ వంతు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
అంతకు ముందు చార్మినార్ సమీపంలోని సర్దార్ మహల్, పాతబస్టాండ్ ప్రాంతాలను ఎమ్మెల్యేలు జుల్పికర్ అలీ, ఎమ్మెల్యే రహమత్ బేగ్‌లతో కలిసి కమిషనర్ సందర్శించారు. మౌలిక సదుపాయాలు, ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్, వారసత్వ నిర్మాణాల అభివృద్ధిని ప్రజాప్రతినిధులు, అధికారులను అ డిగి తెలుసుకున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ వచ్చేనెల 8 వరకు కొనసాగుతుందన్నారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్లు వెంకన్న, హేమంత్ కేశవ్ పాటిల్ పాల్గొన్నారు.