సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాల మేరకు ఫుడ్ సేప్టీ అధికారులు(Food safety officers) గ్రేటర్(GHMC) వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ క్యాంటీన్లలో ప్రత్యేక డ్రైవ్(Special drive) చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో తనిఖీలు చేశారు. 12 రెసిడెన్షియల్ విద్యాలయాలు, హాస్టళ్లను తనిఖీ చేశారు. ఎల్బీనగర్ జోన్లో ఒకటి, చార్మినార్ జోన్లో 4, ఖైరతాబాద్ జోన్లో ఒకటి, శేరిలింగంపల్లి జోన్లో రెండు, కూకట్పల్లి జోన్లో ఒకటి, సికింద్రాబాద్ జోన్లో మూడింటిని తనిఖీ చేశారు.
తనిఖీల్లో భాగంగా వంటగది, వంట సామగ్రి, వాటర్ ట్యాంక్స్, స్టోరేజ్ ఏరియా, తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్, రా మెటీరియల్, పారిశుద్ధ్య నిర్వహణ తదితరాలను ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం పరిశీలించారు. నిబంధనలు పాటించని రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, హాస్టళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని అధికారులు హెచ్చరించారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు 15 రోజుల పాటు నిర్వహించనున్నారు.