మేడ్చల్, ఫిబ్రవరి17(నమస్తే తెలంగాణ) : పదో తరగతితో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంపై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ పాఠశాలలలో చదివే పదో తరగతి విద్యార్థులకు 40 రోజులుగా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 108 ఉన్నత పాఠశాలలకు చదివే 7,601 పదవతరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతుంది.
మార్చి 18 నుంచి జరగనున్న 10 తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో భాగంగా పాఠశాల వేళల్లో అదనంగా రెండు గంటల పాటు తరగతులను నిర్వహిస్తున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి 9: 30 వరకు సాయంత్రం 4: 30 నుంచి 5: 30 వరకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.
జనవరి 19 వరకు సిలబస్‌ను పూర్తి చేసి ఇటీవలే ప్రాక్టిస్ టెస్టులను విద్యార్థులకు నిర్వహించారు. ఈ నెల 19 నుంచి మొదటి ప్రీ ఫైనల్, రెండవ ప్రి ఫైనల్ పరీక్షలు మార్చి 1 నుంచి విద్యాశాఖ నిర్వహించనున్నది. గత ఏడాది జిల్లాలో 91 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యం సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యాధికారిణి విజయకుమారి తెలిపారు.