సిటీబ్యూరో, ఏప్రిల్ 6 ( నమస్తే తెలంగాణ): కరెంట్ పోయిందని కాంప్లైంట్ చేస్తున్నారా.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారా.. ఎన్ని గంటలు కరెంట్ తీసేస్తారంటూ ప్రశ్నిస్తున్నారా.. అయితే మీకు కరెంట్ బిల్ షాక్ తప్పదు. ఎవరైనా మా ఏరియాలో ఫలానా సర్వీసులో కరెంట్ పోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చాలు.. వారికి సిబ్బంది నుంచి వేధింపులు తప్పట్లేదని కొందరు వినియోగదారులు చెప్పారు. ఇటీవల వర్షాలకు పవర్ కట్స్ సందర్భంలో చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు.
కొన్ని చోట్ల సమస్యలు పరిష్కరించినప్పటికీ.. మరికొందరు వినియోగదారులకు మాత్రం విద్యుత్ సిబ్బంది నుంచి బెదిరింపులు తప్పలేదు. మీరెందుకు ఫిర్యాదు చేశారంటూ కొందరు వినియోగదారులను సిబ్బంది ఏకంగా ఇంటికే వచ్చి అడిగినట్లు తెలిసింది. ఇక కొందరికేమో తమ ఏరియాలో కరెంట్ పోయిందంటే మీ సర్వీస్ నంబర్ ఎంత అంటూ అడిగి ఒకవేళ వారు ఇవ్వకపోతే వారి ఫిర్యాదులకు స్పందించకపోవడం వంటివి చేస్తున్నారు.
గత వారంలో కురిసిన అకాలవర్షాలకు తమ వద్ద కరెంట్ పోయిందని ఒక వినియోగదారుడు ఫిర్యాదు చేస్తే అతని గృహజ్యోతి పథకం కట్ చేశారు. కాటేదాన్‌లోని గగన్‌పహాడ్ సెక్షన్ లక్ష్మీగూడకు చెందిన సమ తకు సంబంధించిన కరెంట్ బిల్లు విషయంలో విద్యుత్ సిబ్బంది ఇలాంటి బెదిరింపులకు దిగారు. ఈనెల 3న వినియోగదారుడు తమ ప్రాంతంలో కరెంట్ పోయిందంటూ సోషల్ మీడియాలో ఎస్పీడీసీఎల్కు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన వివరాలు కూడా ఇచ్చారు.
అయితే మీరు ఎందుకు ఫిర్యాదు చేశారంటూ సంబంధిత ఏరియాకు చెందిన విద్యుత్ సిబ్బంది అక్కడకు వచ్చి వారికి కరెంట్ బిల్లు ఇచ్చారు. ఈ బిల్లులో తాము గత నెల వరకు గృహజ్యోతి లబ్ధ్దిదారులైనప్పటికీ ఈ ఫిర్యాదు చేసిన తెల్లవారే వచ్చి కరెంట్ బిల్లు ఇచ్చి అందులో గృహ జ్యోతి లేకుండా బిల్లు వేశారని ఆ వినియోగదారుడు వాపోయారు. ఇందుకు సంబంధించిన రెండు బిల్లులను అదే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వీటిపై సమాధాన మివ్వాలంటూ నిలదీసినా విద్యుత్ సిబ్బంది నుంచి ఎలాంటి స్పందనా లేదు. మార్చి 6న ఇచ్చిన బిల్లులో 185 యూనిట్లు కాగా బిల్లు రూ.906 లుగా వచ్చింది.
దీనికి సబ్సిడీగా రూ.906 లు చూపించి జీరో బిల్లు చేశారు. అదే వినియోగదారుడికి ఈనెల 4న బిల్లు ఇచ్చి అందులో 199 యూనిట్లు కరెంట్ వినియోగం జరగగా.. రూ.1206లు బిల్లుగా ఇచ్చారు. ఈ బిల్లుపై గృహజ్యోతి పథకం లబ్ధిదారుడిగా లేకుండా కేవలం ఫిర్యాదు చేసినందుకే ఇలా చేశారని ఆ వినియోగదారుడు వాపోతున్నారు.
అయితే మార్చి నెల బిల్లు 28 రోజులకు తీస్తే.. ఏప్రిల్ నెల బిల్లును 29 రోజులకు తీసి యావరేజ్ మంత్ యూనిట్స్ 213గా చూపిస్తున్నారని, ఇదంతా కేవలం తాము ఫిర్యాదు చేసినందుకే అని సదరు వినియోగదారుడు చెప్పారు. అయితే ఈ విషయంపై సంబంధిత అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తే ఈ బిల్లు వ్యవహారమంతా తమ పై అధికారులకే తెలుసని చెప్పారు. మరి గృహజ్యోతి వినియోగదారులైనంతమాత్రాన కరెంట్ పోతే ఫిర్యాదు చేయకూడదా అంటూ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.