గడియ పెట్టలేదని.. దోచేశారు..!

చార్మినార్ : తెల్లవారు జామున మసీదుల్లో ప్రార్థనలకు వెళ్తున్న వారి ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.5లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన హబీబ్ అంజాద్ (28) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆటో డ్రైవింగ్ వల్ల తగిన ఆదాయం లభించడంలేదని భావించిన అంజాద్ స్నేహితుడై షేక్ ఫారూఖ్‌తో తన బాధను తెలుపుతూ.. ఎలాగైన డబ్బులు సంపాదించాలని సూచించాడు. అప్పటికే షేక్ ఫారూఖ్ నగర వ్యాప్తంగా వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 30వరకు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అయితే చోరీల్లో ఆరితేరి ఉన్న ఫారూఖ్ చోరీలనే ఎంచుకుందామని తెలిపి.. ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముస్లిం, మైనార్టీ దవాఖాన ప్రాంతంలో చోరీలు చేయడానికి పలుమార్లు రెక్కి నిర్వహించారు. తెల్లవారు జామున మసీదుల్లో నిర్వహించే ఫజర్ నమాజ్‌కు వెళ్లే భక్తుల ఇండ్లను గమనించారు. ప్రార్థనలకు వెళ్లే సమయంలో ఇంటి లోపలి నుంచి గాని.., బయటి నుంచి గాని గడియపెట్టకుండా వదిలేసే ఇండ్లను గుర్తించిన నిందితులు ఆయా ఇండ్లల్లో చోరీలు చేయాలని ప్లాన్ వేసుకున్నారు. నిందితుల ప్లాన్ ప్రకారం ఫారూఖ్ గడియ లేకుండా తెరిచి ఉన్న ఇండ్లను గుర్తించి ఆయా ఇండ్లలోకి ప్రవేశించే వాడు.
అంజాద్ ఇంటి బయట కాపలాకాస్తూ ఏదైనా అలికిడి వినిపిస్తే వెంటనే ఫారూఖ్‌ను అప్రమత్తం చేస్తూ సిగ్నల్స్ అందించే వాడు. ఇలా ఇద్దరు కలిసి మూడు ఇండ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. అనంతరం చోరీ సొత్తును సమానంగా పంచుకునే వారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అంజాద్‌ను సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు ఆటో, రూ.3 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఫారూఖ్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అదుపులోకి చోరీ సొత్తును రికవరీ చేస్తామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని సంతోష్‌నగర్ పోలీసులకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి, దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు ఎన్.శ్రీశైలం, మహ్మద్ తాఖీయుద్దీన్, కె.చంద్రమోహన్, వి.నరేందర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్‌కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్‌స్టాలో జాన్ అబ్రహం షర్ట్‌లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్‌బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడమెలా
- రూ. ౩ లక్షల విలువైన గంజాయి పట్టివేత