HMDA | శంషాబాద్ రూరల్, ఏపిల్ 12 : శంషాబాద్‌లోని హెచ్ఎండీఏ భూముల ఆక్రమణకు ఓ వర్గం యత్నించింది. నిజాం వారసులుగా చెప్పుకుంటూ తప్పుడు పత్రాలతో సుమారు 214 ఎకరాల అసైన్డ్ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాగే కబ్జాకు యత్నించినప్పటికీ అది కుదర్లేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి ఆక్రమించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ దగ్గరి బంధువులు సహకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఈ వివాదం చివరకు హైకోర్టుకు చేరడంతో అసలు విషయాన్ని కనిపెట్టి.. కబ్జాదారులకు చివాట్లు పెట్టింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ట్రక్ టర్మినల్ నిర్మాణం కోసం శంషాబాద్ పట్టణంలోని 724,725 సర్వే నంబర్లలో 214.02 ఎకరాల అసైన్డ్ భూములను హెచ్ఎండీఏకి అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ మేరకు అప్పట్లోనే అవార్డు( నం.1/ 1990. ఫైల్ నంబర్ ఐఏ84/86) ను కూడా జారీ చేసింది. అయితే సర్వే నంబర్ 725/21లో 7.7 ఎకరాలు, సర్వే నంబర్ 725/23లో 10.7 ఎకరాలు సర్వే నంబర్ 725/24లో 12. 34 ఎకరాలతో పాటు పాటు మరికొన్ని సర్వే నంబర్లలో సుమారు 50 ఎకరాల భూమిని తమ పూర్వీకులు (పైగా ఆథారిటీ) నుంచి వేలంలో కొనుగోలు చేశారని పేర్కొంటూ ఫలక్‌నుమాకు చెందిన యహియా ఖురేషీ, వట్టెపల్లికి చెందిన మహ్మద్ మొయినోద్ధీన్ హైకోర్టులో రెండు వ్యాజ్యాలను దాఖలు చేశారు. వాటిలోని అంశాలను నిజాం ఆస్తుల వివాద మూలాలకు సంబంధిచినవిగా కోర్టు భావించింది. ఆ పిటిషన్లకు సీఎస్-7బ్యాచ్ కేసులుగా పిలిచే పిటిషన్లతో జతచేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసి సమాచారం పూర్తిగా తప్పుగా భావించింది. కోర్టుకు దాఖలు చేసిన వివరాలు అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించింది. ఈ భూములు పూర్తిగా హెచ్ఎండీఏకు చెందిన్నట్లుగా గుర్తించిన్నట్లు సమాచారం.
స్థానిక ఎమ్మెల్యే బంధువుల సహకారంతోనే..
శంషాబాద్‌లో ఖాళీగా ఉన్న స్థలాలపై అక్రమార్కుల కన్ను పడింది. దీంతో నిజాం వారసులుగా చెప్పుకుంటున్న పలువరు స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సమీప బంధువు సహకారంతో కబ్జాకు యత్నించారు. మొదటగాఈ అక్రమార్కులు చిన్నచిన్న నిర్మాణాలు చేసి మున్సిపాలిటీ నుంచి ఇంటి నంబర్లను తీసుకున్నారు. ఆ తర్వాత వారి ఆటలు మరింతగా పెరిగిపోయాయి. ఇంటి నంబర్లు ఇచ్చిన వాటిలో ఎకరాల చొప్పున శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2023 మార్చిలో రిజిస్ట్రేషన్ చేయించారు. హెచ్ఎండీఏ భూములలో ఇంటి నిర్మాణాలు , ఆపై రిజిస్ట్రేషన్లే ఎలా చేస్తారని కొందరు ఫిర్యాదులు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన హెచ్ఎండీఏ అధికారులు గత ప్రభుత్వం సహకారంతో ఈ భూములు పూర్తిగా హెచ్ఎండీఏకు చెందినవిగా నిర్ధారించి నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు. ఇంటినంబర్లు రద్దు చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ సైతం రద్దు చేశారు. అంతటితో ఆగకుండా కబ్జాకు యత్నిస్తున్న వారిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. అయినా వారి తీరు మారలేదు. తిరిగి కోర్టుకు తప్పుదోద పట్టించే ప్రయత్నం చేయడంతో అప్పటి ప్రభుత్వం పూర్తిగా అడ్డుకుంది.
మరోసారి కోర్టును అశ్రయించిన కబ్జాదారులు
కోట్ల రూపాయల విలువ చేసే భూములు పూర్తిగా తమకే చెందినవిగా చెప్పుకుంటూ కోర్టును అశ్రయించడంతో.. 9-12-2024లో కోర్టు తమకే చెందిన భూములుగా ఆర్డర్ ఇచ్చిన్నట్లుగా పేర్కొంటు దాదాపు 50 ఎకరాలకు పైగా ఫ్రీకాస్ట్ గోడ(ప్రహారి గోడ) నిర్మాణం చేసి సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి బోర్డులు ఏర్పాటు చేశారు. శంషాబాద్‌కు బంధించిన హెచ్ఎండీఏ భూముల వ్యవహారం శుక్రవారం హైకోర్టులో విచారణకు రావడంతో న్యాయమూర్తి పిటిషిన్లు కోర్టుకు సమర్పించిన నివేదిక పూర్తిగా తప్పుగా ఉన్నట్లు గుర్తించి హెచ్ఎండీఏ భూములపై పూర్తిస్థాయిలో విచారణ చేయడం కోసం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్న వారిపై చార్మినార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారి చేసింది.