సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ): ఎస్ఎన్డీపీ ప్రాజెక్టులు నిర్మించడంతోనే.. గ్రేటర్లోని 175 కాలనీలకు పైగా వరద గండం తప్పిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో 2020 అక్టోబర్లో వచ్చిన వరదల కారణంగా జరిగిన నష్టాన్ని చూసిన తర్వాత మళ్లీ అటువంటి పరిస్థితి రావొద్దన్న సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ) కార్యక్రమాన్ని చేపట్టిందని కేటీఆర్ మంగళవారం ‘ఎక్స్’ వేదికగా వివరించారు. ముఖ్యంగా 40 లక్షల మంది నివసించే ఓల్డ్ సిటీలో ప్రత్యేకంగా నాలాలను బాగు చేసే కార్యక్రమాన్ని తీసుకుందని తెలిపారు.
ఆనాటి చర్యల ఫలితంగా నగరంలోని చారిత్రక ఓల్డ్ సిటీలో వరద ప్రభావిత ప్రాంతాలకు ముంపు ముప్పు తప్పిందని కేటీఆర్ పేర్కొన్నారు. వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా చేపట్టిన చర్యలతో ఇంత భారీ వర్షం పడినా సరే ఓల్డ్ సిటీలో ఎలాంటి సమస్యలు లేకపోవడం విశేషమని కేటీఆర్ అన్నారు. నాటి ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా నాలాల బాగుకోసం అవిశ్రాంతంగా శ్రమించిన అప్పటి చీఫ్ ఇంజినీర్లు జియావుద్దీన్, కిషన్ నాయక్, వసంత్ , ఈఎన్సీ శ్రీధర్లకు కేటీఆర్ ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు.