అధికారుల నిర్లక్ష్యం.. ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షణ లోపం వెరసి ట్రైకార్పొరేషన్ల పరిధిలోని పలు కాలనీల ప్రజలకు శాపంగా మారింది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. లక్ష్యం నీరుగారిపోతున్నది. మెజార్టీ జోనల్ కార్యాలయాల్లో ఐఏఎస్‌ల పాలన సాగుతున్నా.. క్షేత్రస్థాయి సిబ్బందిలో జవాబుదారీతనం కరువైంది. జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో ఫీల్డ్ వర్క్‌లో ఉన్నామంటూ.. కాలక్షేమం చేసే అధికారులు నాసిరకం పనులు, అక్రమ వసూళ్లను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు నాలా పూడికతీత పనులు నత్తన నడకన సాగుతున్నాయి. వర్షాకాలం మొదలు కావడంతో అంపూర్తిగా ఉన్న పనులను కమిషనర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే సమస్యలు పరిష్క రించాలని ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్లువెత్తుతున్నాయి.
– సిటీబ్యూరో/మల్కాజిగిరి, జూన్ 30 (నమస్తే తెలంగాణ)
శాఖల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారింది. న్యూమీర్జాలగూడ, వెంకటేశ్వరకాలనీ ప్రాంతాల్లో ఫిబ్రవరిలో ప్రారంభించిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. విద్యుత్, మున్సిపల్‌శాఖల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. వరదనీటి కాలువ పనులు చేపట్టాల్సిన కాంట్రాక్టర్ కొంతమేర పూర్తిచేసి వదిలేశారు. వరదనీటి కాలువ పనులకు అడ్డుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలు తొలగించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో ఈ కాలనీలు నీట మునిగాయి. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. వెంకటేశ్వరకాలనీ, మీర్జాలగూడ ప్రాంతంలో చేపట్టిన డ్రైన్ పనులు నాసిరకంగా చేపట్టారు. డ్రైన్ పనులతో పాటు, క్యాచ్పిట్లు వేసిన కొన్ని రోజులకే పగుళ్లు తేలాయి. మూతలు పగిలిపోయాయి. ఇలా అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృథావుతున్నది. వరదలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో కాలనీవాసులు ఇబ్బందులు పడనున్నారు.
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో పనులు పూర్తికాలేదు. వర్షాకాలం వచ్చినా పనులు ఇంకా కొనసాగుతున్నాయి. వీటిపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్లో పర్యవేక్షించాల్సిన ఈఈని బదిలీ చేసి, మరో ఈఈని నియమించలేదు. దీంతో కిందిస్థాయి అధికారుల్లో నిర్లక్ష్యం ఏర్పడింది. అత్యధికంగా వరద ముంపునకు గురై మీర్జాలగూడ, చిన్మయి స్కూల్, రాజానగర్, వెంకటాద్రినగర్, పీవీఎన్కాలనీ, వసంతపురికాలనీ, వెంకటేశ్వరకాలనీ, అల్వాల్‌లోని భూదేవినగర్, ఉప్పల్జోన్లోని రవీంద్రనగర్, శ్రీనగర్‌కాలనీ, భవానీనగర్, మల్లికార్జున్‌నగర్ తదితర ప్రాంతాలవాసులు భయందోళనకు గురవుతున్నారు.

Nala Works
జీహెచ్ఎంసీ పరిధిలో వరద నీటి కాలువల పొడవు 1302 కిలోమీటర్ల మేర ఉండగా.. 390 కిలోమీటర్లు మేజర్ నాలా, మైనర్ డ్రైయిన్స్ 912 కిలోమీటర్లు మేర ఉన్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే వరద నీరు సాఫీగా దిగువకు వెళ్లేందుకు పునరుద్ధరణ, మరమ్మతులు చర్యలు చేపడుతున్నారు. అయితే పనులను సకాలంలో జరపకుండా వరద నీటి ముంపునకు అధికారులు కారణమవుతున్నారు. ప్రతి సంవత్సరం పలు ప్రాంతాలు, కాలనీలు నీట మునుగుతున్నాయి. అప్పట్లో కిర్లోస్కర్ కమిటీ పలు సిఫారస్సులను కూడా ఆమలు చేయడంలో జీహెచ్ఎంసీ ఘోరంగా విఫలమవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు తమ బినామీ సంస్థలకు పనులను అప్పగిస్తూ తూతూ మంత్రంగా చేపడుతూ.. ఏటా పూడిక పేరిట కోట్లాది రూపాయలు జేబులు నింపుకొంటున్నట్లు కూడా ప్రచారం సాగుతున్నది. ఈ క్రమంలోనే గత డిసెంబర్ నెలలో నాలా పనులకు టెండర్లు ముగించాల్సిన అధికారులు మార్చి రెండో వారం వరకు కొన్ని చోట్ల టెండర్లతోనే కాలయాపన చేసింది. ఇప్పటికే నాలా పూడికతీత పనులన్నీ గ్రౌండింగ్కి వచ్చి 100 శాతం పూర్తి కావాల్సి ఉంది. కానీ చాలా చోట్ల పనులు పూర్తి కాకపోవడం ఇంజినీర్ల పనితీరుకు అర్థం పడుతున్నది. ఇప్పటికైనా బల్దియా ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడి, యుద్ధప్రాతిపదికన నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని, లేదంటే నగరం మళ్లీ జలమయం కావడం ఖాయమని నగరవాసులు హెచ్చరిస్తున్నారు.
మల్కాజిగిరి, మౌలాలి సర్కిల్స్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో కాలనీలలో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మల్కాజిగిరిలో వరద నీటి కాలువ పనులు పూర్తిచేయకుండా, రోడ్డు తవ్వి వదిలివేయడంతో కాలనీవాసుల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి ప్రధాన రహదారిలోకి వచ్చే కాలనీవాసులకు ఇబ్బందిగా మారింది. వాహనాలను సైతం రోడ్లపైనే దూరంగా నిలుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గౌతంనగర్ డివిజన్లోని పలు కాలనీల్లో జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగిసేవరకు పనులు ప్రారంభించకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్టోబర్‌లో ప్రారంభం కావాల్సిన పనులు ఫిబ్రవరిలో ప్రారంభించారు. దీంతో లోతట్టు ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు..
వర్షాకాలం సమీపించినా ఇంజినీర్లు మొద్దు నిద్ర వీడడం లేదు. ఈ నెల 9న కురిసిన కుండపోత వర్షానికి నాలాలు, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఉప్పొంగిన ఘటనలు చూసినా గుణపాఠం నేర్వడం లేదు. సాధారణంగా మే నెలాఖరు నాటికే నాలాల పూడికతీత (డీసిల్టింగ్) పనులన్నీ పూర్తి కావాలి. జూన్ మొదటి వారం నుంచే వర్షాలు ప్రారంభమవుతాయి. ఆ సమయానికి నాలాలు వరద నీటిని తట్టుకునేలా సిద్ధంగా ఉంచాలి. కానీ ఈసారి జూన్ ముగిసిపోతున్నా.. అనేక ప్రధాన నాలాల్లో పూడికతీత పనులు సగం కూడా దాటలేదు. ప్రధాన నాలాలు, సబ్ -నాలాల నుంచి పూడిక తీసేందుకు ఈ ఏడాది జీహెచ్ఎంసీ రూ.43.35 కోట్లు కేటాయించినా, పనుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే జేసీబీలతో మట్టిని తీస్తుండగా, మరికొన్ని చోట్ల తీసిన పూడికను నాలా పకనే వదిలేశారు. దీంతో వర్షాలకు ఆ మట్టి కాస్తా మళ్లీ కొట్టుకుపోయి నాలాల్లో చేరే పరిస్థితి నెలకొంది. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం మురికి కాలువల్లో కొట్టుకుపోనుంది. ఈ నేపథ్యంలో బుల్కాపూర్ నాలా, పికెట్, నాగమయ్య కుంట నాలా పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి.