Viral | ఆరు నెలల్లో బతకమని తెలిస్తే ఎవరైనా భయపడిపోతారు. కానీ ఆ ఆరేళ్ల చిన్నారి మాత్రం తన వయసుకు మించిన పరిణతితో ఆలోచించాడు. తనకు క్యాన్సర్ అన్న బాధకంటే కూడా ఈ విషయం తెలిస్తే మమ్మీడాడీ ఏమైపోతారేమోననే కుమిలిపోయాడు. తన మనసులోని వేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనకు వైద్యం చేస్తున్న డాక్టర్‌కే చెప్పుకున్నాడు. ‘ నాకు క్యాన్సర్. గూగుల్‌లో చూసి ఈ విషయం తెలుసుకున్నా. అమ్మానాన్నలకు ఈ విషయం తెలియదు. మీరూ చెప్పకండి. చివరి రోజుల్లో వాళ్లను సంతోషంగా చూడాలని అనుకుంటున్నా ‘ అని ఆ పసి హృదయం చేసిన రిక్వెస్ట్‌కు వైద్యుడికి నోట మాటరాలేదు. తాజాగా ఆ బాలుడు మరణించిన తర్వాత తన గుండెల్లో దాచుకున్న బాధను ట్విటర్ ద్వారా బయట ప్రపంచానికి చెప్పుకొచ్చాడు. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ట్విట్టర్లో షేర్ చేసిన ఈ చిన్నారి కథ ఇప్పుడు అందర్నీ కన్నీళ్లు పెట్టిస్తోంది.
హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు. వయసు ఆరేళ్లు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతుండటంతో ఓ ఆస్పత్రికి తీసుకెళ్తే క్యాన్సర్ అని తెలిసింది. అంత చిన్నవయసులోనే తమ బిడ్డ ప్రాణాంతక వ్యాధి బారిన పడటంతో ఎంతో కుమిలిపోయారు. ఎలాగైనా బిడ్డను రక్షించుకోవాలని ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఈ మహమ్మారి గురించి ఆ పిల్లాడికి తెలియనివ్వకుండా చికిత్స ప్రారంభించారు. కానీ తనకు ఉన్న వ్యాధి లక్షణాలు, అందుతున్న చికిత్స, వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా గూగుల్‌లో సెర్చ్ చేసి తాను క్యాన్సర్ బారిన పడ్డానని ఆ పిల్లాడు తెలుసుకున్నాడు. ఓ ఆరు నెలల కంటే ఎక్కువ బతకనని అర్థం చేసుకున్నాడు. ఆ టైమ్‌లో కూడా తన గురించి ఆలోచించలేదు. ఆరు నెలల్లో తను చనిపోతానని తెలిస్తే తన అమ్మానాన్నల పరిస్థితి ఏంటో అని మదనపడిపోయాడు. ఈ విషయం వాళ్లకు చెప్పకుండా మనసులోనే కుమిలిపోయాడు. అలాంటి టైమ్‌లోనే ఆ పేరెంట్స్ బాబును తీసుకుని న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ వద్దకు తీసుకొచ్చారు.
తమ బాబుకు క్యాన్సర్ ఉందని.. మందులు వాడుతున్నామని ఆ తల్లిదండ్రులు డాక్టర్‌కు చెప్పారు. ఇప్పుడు ఫిట్స్ వస్తుందని.. ఆంకాలజిస్ట్ చెప్పడంతో తన వద్దకు వచ్చామని తెలిపారు. మెడికల్ రిపోర్ట్స్ అన్నీ పరిశీలించిన డాక్టర్ సుధీర్ కుమార్.. బాబు మెదడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని. దీని కారణంగానే కాలు, చేయి పనిచేయడం లేదని చెప్పాడు. అలా కొద్దిసేపు ట్రీట్మెంట్ గురించి మాట్లాడిన తర్వాత ఆ పిల్లాడు అమ్మానాన్నలను బయటకు వెళ్లమని రిక్వెస్ట్ చేశాడు. వాళ్లు బయటకు వెళ్లిన తర్వాత ఆ పిల్లాడు అసలు విషయం చెప్పాడు. ‘ నాకు క్యాన్సర్.. ఆరునెలల కంటే ఎక్కువ రోజులు బతకను. గూగుల్‌లో సెర్చ్‌చేసి ఈ విషయం తెలుసుకున్నా. కానీ ఈ విషయం మమ్మీడాడీకి చెప్పలేదు. తెలిస్తే వారు తట్టుకోలేరు. ప్లీజ్ మీరు కూడా చెప్పొద్దు ‘ అంటూ ఆ పిల్లాడు చెప్పడంతో డాక్టర్ నోట మాట రాలేదు. ఆరేళ్ల చిన్నారి ఇంత పరిణీతితో ఆలోచించడం చూసి నివ్వెరపోయాడు. చెమర్చిన కళ్లతో ఆ పిల్లాడిని బయటకు పంపించి వాళ్ల అమ్మానాన్నలతో మాట్లాడాడు. ఆ బాబు చెప్పిన విషయాలన్నీ వాళ్లకు చెప్పాడు. మీరు కూడా ఇదంతా తెలియనట్టే ఉండండి.. అప్పుడే చివరి రోజులలో అయినా బాబును సంతోషంగా ఉంచగలుగుతారని సలహా ఇచ్చాడు. తమ గురించి తమ కొడుకు ఎంతలా ఆలోచిస్తున్నాడో డాక్టర్ మాటల్లో తెలుసుకుని కుమిలిపోయారు. గుండెల నిండా బాధతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇది జరిగి 9 నెలలు గడిచిపోయింది. ఆ తర్వాత ఈ విషయాన్ని డాక్టర్ సుధీర్ కుమార్ మరిచిపోయాడు. తన పనిలో పడిపోయాడు. ఇంతలో మళ్లీ ఆ పేరెంట్స్ డాక్టర్ వద్దకు వచ్చాడు. వాళ్లను చూడగానే డాక్టర్ సుధీర్‌కుమార్‌కు ఆ పిల్లాడు గుర్తొచ్చి తన గురించి అడిగాడు. అప్పుడు నెల కిందటే తమ కొడుకు తమను వదిలేసి వెళ్లిపోయాడని వాళ్లు డాక్టర్‌కు చెప్పారు. ఆ రోజు తనను కలిసిన తర్వాత ఎంతగానో ఆలోచించామని.. చివరి రోజుల్లో బాబును ఎంతో సంతోషంగా చూసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అలా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఫుల్ టైమ్ అతనితోనే గడిపామని చెప్పారు. తనకు నచ్చిన వంటకాలు చేసి పెడుతూ.. డిస్నీ ల్యాండ్, థీమ్ పార్క్ అన్ని తిప్పుతూ సంతోషంగా చూసుకున్నామన్నారు. అలా తమ జీవితానికి సరిపడా జ్ఞాపకాలను సమకూర్చుకున్నామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనను వివరిస్తూ డాక్టర్ సుధీర్ కుమార్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అమ్మానాన్నల కోసం ఆరేళ్ల చిన్నారి ఆలోచించిన తీరు.. వాళ్ల మీద అతనికి ఉన్న ప్రేమ ఇప్పుడు అందరి హృదయాలను కలచివేస్తున్నాయి.
ప్యాసింజర్‌ను చితకొట్టిన రైల్వే టీసీలు.. వీడియో వైరల్..!
Viral News | పెళ్లైన గంటకే భార్యకు విడాకులు.. ఆపై సోదరుడికిచ్చి వివాహం..!
వైరల్ వీడియో : మెయిన్ రోడ్‌పై వాహనాలు పార్క్ చేస్తే ఏమవుతుందంటే..!