HMDA | సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన శివ బాలకృష్ణ విచారణ పూర్తయింది. విచారణ సమయంలో ఏసీబీ అధికారులు 4 రోజుల పాటు అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్సులో ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కీలకమైన పత్రాలు జిరాక్స్ తీసుకోవడంతో పాటు కొన్నింటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేసుకున్నారు.
కాగా 4 రోజుల పాటు జరిగిన ఏసీబీ విచారణ, అనుమతుల పత్రాల పరిశీలన తర్వాత హెచ్ఎండీఏ ప్రణాళిక విభాగంలో బాలకృష్ణ ఆదేశాలకు అనుగుణంగా పలువురు అధికారులు పనిచేసినట్లు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటి వరకు భారీ బహుళ అంతస్తుల భవనాల అనుమతులు, గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లకు ఇచ్చిన అనుమతుల పత్రాలను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్బంగా కొన్ని అనుమతుల పత్రాల్లో అప్రోచ్ రోడ్లు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో హైరైజ్ భవనాలకు అనుమతులు ఇచ్చారని, అలాంటి ఫైళ్ల ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గుర్తించారు.
క్షేత్ర స్థాయిలో ప్లానింగ్ ఆఫీసర్‌తో పాటు ఏపీవోలు, జేపీవోలు తనిఖీ చేసి నివేదికను రూపొందించాల్సి ఉన్నా, డైరెక్టర్‌గా ఉన్న బాలకృష్ణ చెప్పినట్లుగా నివేదికలు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ డైరెక్టర్ కింద పనిచేసిన కొందరు అధికారులను కూడా ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. శివ బాలకృష్ణ విచారణ పూర్తయే వరకు హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారులు కంటి మీద కునుకు లేకుండా గడపాల్సిన పరిస్థితి నెలకొంది.