Singireddy Niranjareddy | రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు సిగ్గుపడకుండా ఇతరుల మీద నిందలు ఎందుకు వేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో తమ 5.09 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించడాన్ని హైకోర్టులో ఎస్బీఐ సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఎస్బీఐ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తోంది. ఎస్బీఐలోని ప్రభుత్వ డిపాజిట్లు, ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్బీఐ లాంటి దేశంలోని అతి పెద్ద బ్యాంకును బ్లాక్ మెయిల్ చేసే తరహాలో అనుకూల మీడియాలో కథనాలు రాయిస్తుండడం ఈ ప్రభుత్వ పనితనానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో ఎస్బీఐ భూములను వేలం వేసిందని..ఈ ప్రభుత్వానికి వేలం వెర్రిగా భూముల అమ్మకం మీద ఉన్న శ్రద్ధ వాటి సాంకేతిక, పర్యావరణ అంశాల మీద లేదన్నారు.
అందుకే నాడు కంచె గచ్చిబౌలి, మూసీ స్థలాల ఆక్రమణకు కుట్ర, ఇప్పుడు రాయదుర్గం భూముల వేలంలో సర్కారు అవగాహన రాహిత్యం బయటపడిందన్నారు. రాయదుర్గం భూముల వేలంపై ఎస్బీఐ బ్యాంకు కోర్టును ఆశ్రయించడాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఆపాదిస్తూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నానన్నారు.