మెహదీపట్నం: అనారోగ్యంతో మరణించిన అన్న అంత్యక్రియలకు డబ్బుల్లేవని అతని తోబుట్టువులు ఘోరానికి పాల్పడ్డారు. మానవత్వాన్ని మరిచి శరీరాన్ని ముక్కలుగా చేసి ఊరిబయట పడేశారు. కానీ స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఈ దారుణం వెలుగుచూసింది.
గండిపేట మండలం బండ్లగూడ ఎన్ఎఫ్సీ కాలనీలో నివసించే బాలమణికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. పెద్ద కొడుకు విజయ్‌కుమార్ పోస్టాఫీస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి వివాహం జరిగింది. అయితే రెండో కొడుకు అశోక్ (52), మూడో కొడుకు రాజ్‌కుమార్ (45), పెద్ద బిడ్డ స్వరూప రాణి (38) లకు పెళ్లి కాలేదు. చిన్న బిడ్డ శోభారాణి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటున్నది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్వీపర్‌గా ఉద్యోగం చేస్తున్నది.
అయితే, వయసు మీరిన పెళ్లిళ్లు కాకపోవడం, సంపాదనకు ఏ ఉద్యోగం లేకపోవడం లాంటి కారణాలతో రెండో కొడుకు అశోక్, మూడో కొడుకు రాజ్‌కుమార్‌లు మద్యానికి బానిసలయ్యారు. వారితోపాటు వారి సోదరి స్వరూప రాణి మానసికంగా కుంగిపోయారు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం అనారోగ్యానికి గురైన అశోక్ ప్రభుత్వం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు.
దాంతో ఏ సంపాదనా లేని అతని తమ్ముడు రాజ్‌కుమార్ అన్న అంత్యక్రియలకు డబ్బులు ఖర్చవుతాయని భయపడ్డాడు. అశోక్ మరణ విషయం ఎవరికీ చెప్పకుండా ఇంట్లోనే అతని శరీరాన్ని ముక్కలు కోశాడు. ఆ తర్వాత సోదరి స్వరూపారాణితో కలిసి ఆ ముక్కలను ఓ గోనె సంచిలో తీసుకెళ్లి లంగర్‌హౌస్ దర్గా సమీపంలో పడేశారు. గోనెసంచిలో మనిషి అవయవాలు గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు రాజ్‌కుమార్, స్వరూపారాణిలను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే శుక్రవారం మృతదేహాలు ఎక్కువగా ఉండటంతో వైద్యులు అశోక్ మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహిస్తామని చెప్పారు.