సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ నగర కీర్తి కిరీటంలో ఇదో మాయని మచ్చ. క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో పేరుకుపోతున్న చెత్తాచెదారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రై కార్పొరేషన్ల నుంచి సేకరించిన చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించడంతో ఇక్కడి నుంచి వెలువడుతున్న విష వాయువులు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య నగరాల జాబితాలో నాలుగో స్థానంలో నిలబెట్టాయి. మొదటి మూడు నగరాలు బ్యూనోస్ ఏరీస్, జకర్తా, కౌలాలంపూర్ నగరాలు ఉంటే హైదరాబాద్ నగరం 4వ స్థానంలో ఉందంటూ.. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా(యూసీఎల్ఏ) నిర్వహించిన తాజా అధ్యయనంలో విస్తుపోయే నిజాలను వెల్లడించింది.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి మిథేన్ వాయువుకు ప్రధాన కేంద్రంగా మారిందని, ఈ యార్డు నుంచి ప్రతి గంటకు ఏకంగా 5.9 టన్నుల మిథేన్ గాలిలో కలుస్తోందని ఈ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న 25 నగరాల జాబితాను పరిశీలించగా, హైదరాబాద్ ఏకంగా నాలుగో స్థానానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. దాదాపు 10 లక్షల కార్లు ఒకేసారి రోడ్డు మీదకు వచ్చి పొగను విడుదల చేస్తే ఎంతటి ప్రమాదం పొంచి ఉంటుందో, కేవలం జవహర్‌నగర్ యార్డు నుంచి విడుదలయ్యే మిథేన్ వల్ల అంతటి నష్టం జరుగుతోందని నివేదికలో లెకగట్టారు. కార్బన్ డైయాక్సైడ్ కంటే మిథేన్ వాయువు పర్యావరణానికి 80 రెట్లు ఎకువ హానికరమని, ఇది గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణమవుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ వర్సిటీ పరిశోధనల్లో..
పర్యావరణ పరంగా దేశానికే గర్వకారణంగా ఉండాల్సిన మహానగరాలు.. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అత్యంత కాలుష్యకారక నగరాల జాబితాలో నిలిచాయి. హైదరాబాద్‌లోని జవహర్ నగర్, ముంబైలోని కంజుర్ మార్గ్ ప్రపంచంలోనే అత్యధికంగా మిథేన్ వాయువును విడుదల చేస్తున్న మొదటి 25 సైట్లలో చోటు దకించుకున్నాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్, స్టాప్ మీథేన్ ప్రాజెక్ట్ పేరుతో నిర్వహించిన తాజా పరిశోధనలో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లోని 25 వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు విపరీతమైన మిథేన్ ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జవహర్‌నగర్ ల్యాండ్ ఫిల్ నుంచి ప్రతి గంటకు ఏకంగా 5.9 టన్నుల మిథేన్ విడుదలవుతోంది. దీంతో ఈ జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచి డర్టీ సిటీగా ముద్ర వేయించుకుంది.
ఇక ముంబైలోని కంజుర్ మార్గ్ గంటకు 4.9 టన్నుల ఉద్గారాలతో 12వ స్థానంలో ఉంది. 2025లో కీలక శాటిలైట్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా 700 వ్యర్థాల కేంద్రాల నుంచి వెలువడే 3,000 ప్లూమ్స్ (పొగ మేఘాలు)ను పరిశీలించిన తర్వాత ఈ 25 కేంద్రాలను గుర్తించారు. ఈ జాబితాలో భారత్‌తో పాటు బ్రెజిల్, చిలీ, సౌదీ అరేబియా, టరీ వంటి దేశాలు కూడా ఉన్నాయి.
ఈ గణాంకాలు బాధ్యతాయుతమైన ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక లాంటిదని, వ్యర్థాల నిర్వహణ రంగంలో తక్షణ మార్పులు తీసుకురావడానికి ఈ డేటా ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుందని నివేదికలో వెల్లడించారు. కాగా ఈ అధ్యయన ఫలితాలపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు కలుషితమై జనం రోగాల బారిన పడుతుంటే, ఇప్పుడు గాలిలో కలుస్తున్న మిథేన్ వల్ల శ్వాసకోస వ్యాధులు ప్రబలే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలొని శాస్త్రీయ పద్ధతుల్లో చెత్త శుద్ధి ప్రక్రియను చేపట్టకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ ఊపిరి పీల్చుకోవడం దుర్లభంగా మారుతుందని పర్యావరణవేత్తలు, స్థానిక జవహర్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న జవహర్‌నగర్
జవహర్‌నగర్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది.. గడిచిన రెండున్నర ఏళ్లుగా చెత్త నిర్వహణలో ప్రభుత్వం విఫలమైంది. జవహర్‌నగర్‌కు రోజూ దాదాపు 11వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మూడు కార్పొరేషన్ల చెత్తను ఒక్క జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకే తరలిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలైన డంపింగ్ యార్డులు (ప్రాసెసింగ్ యూనిట్లు, లక్డారం, ప్యారానగర్, ఖానాపూర్) నెలకొల్పకుండా..సదరు రాంకీపై సర్కారు ఆధారపడిన తీరు ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు వద్ద శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణ చేయడంలో సదరు రాంకీ సంస్థ విఫలమైందని, ఎన్జీటీ సంస్థలు మొట్టి కాయలు వేశాయి. అక్కడ కుళ్లిన చెత్త వాసనతో , కాలుష్యంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుండగా, తాజా నివేదిక అంశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.