వరంగల్‌లోని అమరవీరుల స్తూపం మళ్లీ కన్నీరు కార్చింది. స్వరాష్ట్రం కోసం సాగిన పోరాటంలో ప్రాణత్యాగం చేసినవారి భౌతికకాయాలను స్తూపం వద్దకు తీసుకొచ్చి నివాళులు అర్పించాలని ఉద్యమకారులు నిర్ణయం తీసుకున్నప్పుడు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల ఆదేశంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. వలయాలుగా ఏర్పడి అడ్డుకోవటానికి యత్నిస్తున్నప్పుడు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి, ముఖ్యనేతల కనుసన్నల్లో అమరుల దేహం బందూకై మొలకెత్తేది. అట్లాంటిది నేడు సుదర్శన్‌రెడ్డే అమరుడై స్తూపం వద్దకు రావడంతో జనం, ఉద్యమ సహచరులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కంటికి పది ధారలుగా వలపోశారు. ‘పానం అసుంటి మనిషి పోబట్టే’ అని బోరుమన్నారు.
తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌కు పెద్ద దిక్కులా నిలిచిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన అంతిమయాత్రకు తరలివచ్చిన జనసంద్రాన్ని చూసినవాళ్లంతా.. ఇది కదా పెద్ది అన్న సంపాదించుకొన్న ఆస్తి అని స్మరించుకున్నారు. ‘పెద్దిని తీస్కస్తాండ్రంటే పానం ఆగలే. ఉరికొచ్చిన’ అని ఇలా ఎంతోమంది ఎవరికివారుగా ఎరుకకాంగనే అమరవీరుల స్తూపం దగ్గరికి ఉరికి వచ్చిండ్రు. ఆదివారం సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానలో చేరినప్పటి నుంచి ఆయనను బతికించుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్త నుంచి అధినేత కేసీఆర్ వరకు అందరూ తపన పడ్డారు. హనుమకొండలోని ఓ దవాఖానలో పెద్దిని చేర్పించారు అనే విషయం తెలియగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హుటాహుటిన వరంగల్ చేరుకున్నారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించి అక్కడా అనేక విధాలుగా ఆరాటపడ్డారు. చివరికి గురువారం అర్ధరాత్రి దాటాక పెద్ది సుదర్శన్‌రెడ్డి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ప్రతి ఒక్కరికీ పెద్ది సుదర్శన్‌రెడ్డి వరంగల్ ‘పెద్దన్న’గా సుపరిచితుడు. నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలానికి చెందిన పెద్ది సుదర్శన్‌రెడ్డి, యావత్తు తెలంగాణకు ఉద్యమగుర్తు. ఉద్యమం ఊగిసలాటలో పడిన ప్రతి సందర్భంలో వరంగల్ ఉవ్వెత్తున కెరటం వలె ఎగసిపడ్డది. ఉద్యమనేత కేసీఆర్ తీర్చిదిద్దిన అనేక మందిలో పెద్ది ఒకరు. కానీ, అందరిలో పెద్ది మార్క్ ప్రత్యేకం. అంత ప్రత్యేకమైనవాడు కనుకనే అధినేత కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడయ్యారు. తనను తాను మలుచుకుంటూ ఉద్యమానికి మలుపుతిప్పే అనేక ఘటనలకు సాక్షీభూతుడిగా, సహచరుడిగా, వరంగల్ ఉద్యమ నిర్మాణకర్తగా పెద్ది ఎదిగిన తీరు అసామాన్యమైనది. పెద్ది సుదర్శన్‌రెడ్డి రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవాడు కాదు కానీ, రాజకీయ ముఖచిత్రంలో తన అధ్యాయాన్ని చిరస్థాయిగా నిలిచేలా మలుచుకున్నారు.
తెలంగాణ ఉద్యమం కొడిగట్టిన దీపంలా మారిన ప్రతి సందర్భంలోనూ వరంగల్‌ను కేసీఆర్‌కు కుడిభుజంలా మలచినవాడు పెద్ది. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం సాగుతున్న క్రమంలో ఉద్యమాన్ని కాటగలపాలని సమైక్యపాలకులు చూసిన ప్రతి సందర్భంలో గొంతెత్తి నినదించినవాడు.
పార్లమెంట్లో సమైక్యాంధ్ర ప్లకార్డు ప్రదర్శించి ప్రజల్లో తెలంగాణ వాదం లేదని వైఎస్ జగన్ ప్రయత్నం చేసే క్రమంలో మానుకోట రాళ్లు తిరుగుబాటు చేశాయి. ఆ రాళ్లకు సైతం తిరుగుబాటు పాఠం నూరిపోసిన ఉద్యమనాయకత్వంలో పెద్దిది కీలకపాత్ర. జగన్ మానుకోట పర్యటనను రెండు రోజుల ముందు వరంగల్ కొత్తవాడలో రాజ్‌కుమార్ అనే యువకుడు జగన్రాకను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కాగితంపై ‘నా చావుతోనైనా జగన్ మానుకోట పర్యటనను రద్దు చేసుకోవాలి’ అని రాసి ఉన్న చీటీ రహస్యాన్ని ఛేదించి ఉద్యమాన్ని మండించాడు. అలాగే, నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేటకు చెందిన సవేరా అనే యువతి తెలంగాణ కోసం తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకొని మరణించిందన్న విషయం తెలుసుకొని నర్సంపేట దవాఖానలో ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం ఆ యువతి ఒంటిపై దూదిని కట్టించి తన చేతులతో ఎత్తుకొని వరంగల్ ఎంజీఎంకు తీసుకొచ్చి ఉద్విగ్నభరితుడయ్యారు. ఇట్లా ఒకటా రెండా అనేక ఘటనలు. ఎవరికివారు.. ఎవరి అనుభవంలోకి వచ్చిన విషయాలను వారు గుర్తుచేసుకుంటూ పెద్దితో భుజం భుజం కలిపి ఉద్యమించిన రోజులను గుర్తుచేసుకొంటున్నారు.
తెలంగాణ ఉద్యమ రథసారథి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉద్యమ బంధువే కాదు ఆత్మబంధువు కూడా. 2001 నుంచి ఇప్పటి దాకా వారిది గురుశిష్య అనుబంధం. పెద్ది పట్ల కేసీఆర్‌ది పుత్రవాత్సల్యం. ‘నాకెవ్వలతోని సంబంధం లేదు పెద్దాయన చెప్పిండు… పెద్ది చేస్తడు. గంతే. నాకు తతిమ్మోళ్లతోని పనిలేదు’ ఎంతటివాళ్లతోనైనా కరాఖండిగా చెప్పే క్రమశిక్షణగల కరడుగట్టిన కేసీఆర్ సైనికుడిగా పెద్ది సుదర్శన్‌రెడ్డి వ్యవహరించారు. ప్రజాకవి కాళోజీని కేసీఆర్ ఎంతగా ఆరాధించారో.. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్‌ను అంతకన్నా ఎక్కువగా మనసుకు హత్తుకున్నారు. తెలంగాణను కండ్ల చూశాకే కన్నుమూస్తా అని శపథం చేసిన భూపతి కృష్ణమూర్తి తపనను ఎంతగా ముందుకు తీసుకెళ్లారో ఆచార్య బియ్యాల జనార్దన్‌రావు తండ్లాటను అంతకన్నా మిన్నగా చూశారు. గూడేలు, తండాలకు తెలంగాణ ఉద్యమాన్ని తలకెత్తుకొని తిప్పారు. వ్యవసాయ కూలీ ఫణికర మల్లయ్య వెలిబుచ్చిన ఆరాటంలోని ఆర్తిని ఎంతగా ఇష్టపడ్డారో బీఆర్ఎస్లో కరడుగట్టిన తెలంగాణ యోధుడిగా మారిన పెద్ది సుదర్శన్‌రెడ్డిని చూసి ప్రతి సందర్భంలోనూ మురిసిపోయేవారు.
తెలంగాణలో ఫ్యాక్షన్ రాజకీయ నియోజకవర్గాలుగా ముద్రపడిన నర్సంపేట నియోజకవర్గంలో అటు పెండెం కట్టయ్యకు, ఇటు మద్దికాయల ఓంకార్‌కు మధ్య జరిగిన ‘వార్’లో ఓంకార్‌ను పెద్ది సుదర్శన్‌రెడ్డి యువకుడిగా ఉన్నప్పుడే ఎదిరించారు. 2001లో నల్లబెల్లి జడ్పీటీసీగా పోటీచేసేందుకు కాంగ్రెస్ అవకాశం కల్పించినా, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావు, న్యాయవాది ముద్దసాని సహోదర్‌రెడ్డి సూచన మేరకు టీఆర్ఎస్లో చేరారు.
తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. నల్లబెల్లి జడ్పీటీసీగా రైతునాగలి గుర్తుపై గెలిచి, కేసీఆర్ నాయకత్వంలో తనను తాను నాయకుడిగా మలచుకున్నారు. 2001 నుంచి కేసీఆర్ వేలును విడిచిపెట్టలేదు.
ముఖ్యంగా 2004లో వరంగల్ జిల్లా నుంచి గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కనుసన్నల్లో పార్టీని, ఉద్యమాన్ని వీడి వెళ్లినప్పుడు, ఆ కల్లోల సమయంలో టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పెద్ది సుదర్శన్‌రెడ్డి ఒక పెట్టనికోటలా నిలబడ్డారు. చెల్లాచెదురైన ఉద్యమశక్తుల్ని తిరిగి కూడగట్టారు. 2009 ఎన్నికల ఓటమి తర్వాత ఆవహించిన నిశ్శబ్దాన్ని, నిస్పృహను చీల్చుకుంటూ నిప్పురవ్వలు రాజేసి, ఉద్యమజ్వాలలు రగిలించిన దృఢచిత్తుడు పెద్ది. అందుకే మొన్న యశోదా దవాఖానలో పెద్ది ఆరోగ్యస్థితిగతులను తెలుసుకునేందుకు వెళ్లిన కేసీఆర్ ఉద్విగ్నులయ్యారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి అకాలమరణంతో యావత్తు తెలంగాణలోని బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమ సహచరులు ఆవేదనలో మునిగిపోయారు.