శేరిలింగంపల్లి జోన్లో రూ. 153 కోట్ల పన్ను వసూళ్లు
బల్దియాలో మొదటి స్థానం
మియాపూర్, మే 1 : జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్‌కు ఎర్లీబర్డ్‌లో ఆస్తిన్నుల వసూళ్ల వరద కొనసాగింది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అత్యథిక ఆస్తిపన్ను వసూళ్లతో బల్దియాలో మరోసారి తన గుర్తింపును నిలుపుకుంది. 2022- 23 ఆర్థిక సంవత్సరానికి గాను తొలి నెల ఏప్రిల్ మాసంలో ప్రకటించిన ఎర్లీబర్డ్ పథకం ద్వారా శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా రూ. 153 కోట్ల ఆస్తిపన్ను వసూళ్లు నమోదయ్యాయి. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లకు గాను శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో రూ. 91 కోట్లు, చందానగర్ సర్కిల్లో రూ. 47 కోట్లు, యూసుఫ్‌గూడ సర్కిల్లో రూ. 13 కోట్లు, ఆర్సీపూర్ పటాన్ చెరు సర్కిల్ పరిధిలో రూ. 6 కోట్లు ఎర్లీబర్డ్ పథకంలో వసూళ్లలయ్యాయి. కాగా శేరిలింగంపల్లి సర్కిల్లో రూ. 60 కోట్లకు గాను రూ. 91 కోట్లు, చందానగర్ సర్కిల్లో రూ. 29 కోట్లకు గాను రూ. 47 కోట్లు, యూసుఫ్‌గూడ సర్కిల్లో రూ.7 కోట్లకు గాను రూ. 12 కోట్లు, పటాన్ చెరు సర్కిల్ పరిధిలో రూ. 3 కోట్లకు గాను రూ. 6 కోట్ల వసూళ్ళను నమోదు చేశారు. జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లు తమ లక్ష్యానికి మించి అదనపు వసూళ్లతో తమ సత్తాను చాటాయి.
అధికారుల ప్రణాళికలతో.. సత్ఫలితాలు
జోనల్ కమిషనర్, ఐఏఎస్ అధికారిణి ప్రియాంక అల ఎర్లీబర్డ్ పథకంపై తరచుగా నిర్వహించిన సమీక్షలు సత్ఫలితాలనిచ్చి..లక్ష్యానికి మించి వసూళ్లకు దోహదపడ్డాయి. కాగా ఎర్లీబర్డ్ ఆస్తిపన్ను వసూళ్లలో శేరిలింగంపల్లి జోన్ బల్దియాలో ప్రథమ స్థానంలో నిలవగా.. సర్కిళ్ల పరంగా శేరిలింగంపల్లి, చందానగర్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. ఆయా సర్కిళ్ల డీసీలు తేజావత్ వెంకన్ననాయక్, నందగిరి సుధాంశ్ల పర్యవేక్షణలో పన్ను విభాగం ఏఎంసీలు సుధీర్ చంద్ర, వాహీద్, నరేందర్‌రెడ్డి, సత్యనారాణరావు, గోపాల కృష్ణల నేతృత్వంలో టీఐలు, బిసీలు క్షేత్రస్థాయితో తగు కృషి చేయటం ఎర్లీబర్డ్ పన్ను వసూళ్లలో తమ స్థానాలను పదిల పరుచుకోవటంలో దోహదపడ్డాయి.
రూ.153 కోట్లు వసూళ్లు..
శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా ఎర్లీబర్డ్ పథకంలో ఆస్తి పన్ను వసూళ్లు గణనీయంగా నమోదయ్యాయి. జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో కలిపి రూ. 153 కోట్ల ఆస్తిపన్ను వసూళ్లు నమోదైంది. బల్దియాలో తగు స్థానంలో శేరిలింగంపల్లి నిలిచినట్లు భావిస్తున్నాం. శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లు మంచి పనితీరు కనబరిచాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది సైతం తగు కృషి చేయటం వల్ల మంచి ఫలితాలు నమోదయ్యాయి. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తూ ముందుకు సాగాలి. ఎర్లీబర్డ్ లక్ష్యాలను చేరుకోవటంలో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నాం.
– మమత, ఇన్చార్జి జోనల్ కమిషనర్
శేరిలింగంపల్లి జోన్