గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరంగా పేరుగాంచింది. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నివసిస్తున్నారు. ఏండ్ల తరబడిగా ఉంటూ.. ఉద్యోగ, ఉపాధి పొందుతూ జీవిస్తున్నారు. కొంతమంది ఇండ్లు నిర్మించుకొని శాశ్వతంగా నివసిస్తున్నారు. మరికొంత మంది సిటీలో సుదీర్ఘకాలంగా ఉంటున్నా తాము పుట్టి పెరిగిన ఊరిని వదలకుండా తరచూ వెళ్లి వస్తుంటారు. ఆస్తులు, స్థలాలు కూడా అక్కడే పెంచుకుంటూ సిటీని ఉద్యోగ, ఉపాధి పొందే ప్రాంతంగానే భావిస్తున్నారు.
సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ)/వనస్థలిపురం/గోల్నాక/మేడ్చల్/ మియాపూర్ : ఎన్నేండ్లున్నా ఎన్నికలప్పుడు ఓటేయడానికి మాత్రం సొంతూరికి కొంతమంది వెళ్తుంటే.. మరికొంత మంది ఇక్కడే శాశ్వత చిరునామాను ఏర్పరుచుకుని ఇక్కడే ఓటు హక్కును కలిగి ఉన్నారు. కొంతమంది మాత్రం అక్కడా.. ఇక్కడా డబుల్ ఓట్లేస్తున్నారు. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సర్ ప్రక్రియ విషయంలో మాత్రం మెజార్టీ సెటిలర్లు సొంతూళ్లకే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ర్టాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారిలో ఎక్కువ మంది సిటీని ఉద్యోగం, ఉపాధికే పరిమితం చేస్తూ తమ సొంత రాష్ర్టాల్లోనే ఓటు నమోదు చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిలో ఏండ్ల తరబడిగా ఇక్కడే ఉండి ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్లు సిటీలోనే ఉంటామంటున్నారు. కొంతమంది మాత్రం తమ సొంతూళ్లకే ఓటేస్తున్నారు.
ఎటూ తేల్చుకోలేక ..
అంబర్‌పేట నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ స్థానికులను అయోమయం చేస్తోంది. నియోజకవర్గంలో దాదాపు 2లక్షల 85 వేల ఓటర్లు ఉండగా అందులో తెలంగాణ నుంచి పలు జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది వలస వచ్చిన వారే.. వీరికి సొంతూరితో పాటు అంబర్పేటలోనూ ఓట్లు ఉన్నాయి. ఇప్పడు ఎక్కడో ఒక చోట మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాలనే నిబంధనతో దాదాపు 60వేల నుంచి 70 వేల వరకు ఓట్లకు కత్తెర పడేలా ఉంది. సొంత ఊర్లో ఓటుంటేనే పరువు ఉంటుందనే భావనతో మెజార్టీ ప్రజలు ఇక్కడ ఓటు పోయినా పర్లేదు కానీ.. సొంతూరి ఓటే కావాలని అంటున్నారు. అధికారులు వివరాలు అడుగుతుంటే చెప్పడానికి ఆసక్తి చూపడం లేదు. కాగా.. పక్కాగా సెటిల్ అయిన వారు మాత్రం అంబర్‌పేటలోని ఓటుకే మొగ్గు చూపిస్తున్నారు. ఎటూ తేల్చుకోలేక సగం మంది ఆగం అవుతున్నారు.
సారూ.. నా ఓటు ఉందా
ఖైరతాబాద్, జూలై 6: ‘2002కు ముందు నుంచి నేను ఓటరునే..ప్రస్తుతం అడ్రసు మారాను..ఇక్కడ నా ఓటు ఉందా లేదా అధికారులు చెప్పడం లేదు’ అంటూ ఓ వృద్ధురాలు వాపోయింది. ఖైరతాబాద్‌కు చెందిన కే లక్ష్మి మూడు దశాబ్దాల పాటు ఖైరతాబాద్‌లో నివాసం ఉండి, కొడుకు కుటుంబంతో కలిసి బోరబండకు వెళ్లిపోయింది. పదేండ్ల క్రితం భర్త మరణించి, ఇటీవల కొడుకు సైతం చనిపోయాడు. దీంతో కోడలు, మనుమల బాధ్యతలను చూసుకుంటూ కాలం వెల్లదీస్తోంది. ఇటీవల సర్ ప్రక్రియను ప్రారంభించగా, తన ఓటు ఉందా.. లేదా అనేది తెలుసుకోవడానికి వారం రోజులుగా ఖైరతాబాద్‌కు వచ్చిపోతోంది. అధికారులు , బీఎల్వోలు ఆమె పేరు ఓటరు లిస్టులో ఉందా లేదా అనేది చూసి చెప్పాల్సి ఉండగా, రోజు తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం సైతం తన వద్ద ఉన్న పాత ఓటరు కార్డు, ఆధారు కార్డుతో ఖైరతాబాద్‌కు రాగా, ఒక్క అధికారి కూడా స్పందించలేదని చెబుతోంది.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సర్ ఫారాలు అందజేయాలి
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జి మాగంటి సునీతాగోపీనాథ్
జూబ్లీహిల్స్,జూలై 6: ప్రతి ఇంటిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎస్ఐఆర్ ఫారాలు అందజేయాలని బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జి మాగంటి సునీత గోపీనాథ్ సూచించారు. సోమవారం యూసుఫ్‌గూడ, కృష్ణానగర్ డివిజన్లో పర్యటించి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎస్ఐఆర్ ఫారాలు పంపిణీ చేశారు. ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బీఎల్వోలతో కలిసి మ్యాపింగ్ చేయాలన్నారు.
‘సర్’ ప్రక్రియ పరిశీలన
ఖైరతాబాద్ జూలై 6 : ఖైరతాబాద్ డివిజన్లోని గాంధీతాతానగర్లో సోమవారం చేపట్టిన ‘సర్’ ప్రక్రియను బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. బీఆర్ఎస్ నేత నిషాంత్ ముదిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పాల్గొన్న గోవర్ధన్ రెడ్డి.. మాట్లాడుతూ ప్రతిఅర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, ప్రతి ఒక్కకరూ తమ ఓటు వివరాలను సరిచూసుకోవాలని, అవసరమైన సమయంలో అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, బాలరాజు యాదవ్, క్రాంతి , ప్రభాకర్ రెడ్డి, బిల్ల శ్రీనివాస్ రాజ్, రోహిత్ కుమార్, రావుల విజయ్ కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

సర్‌కు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు
మేడ్చల్, జూలై6(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో సర్‌కు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నాం.. ఓటర్లు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు.. ప్రతి ఇంటికి బీఎల్వోలు ఫారాలు అందిస్తారని కలెక్టర్ మను చౌదరి స్పష్టత ఇచ్చారు. సర్ పక్రియపై కలెక్టర్ నమస్తే తెలంగాణకు వివరాలను వెల్లడించారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని సర్కిళ్లలతో పాటు ఆర్డీవో కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు చేశామని తెలిపారు. బీఎల్వోలు ఫారాలు అందించిన తర్వాత నాలుగు రోజుల నుంచి వారం రోజుల వరకు గడువును ఇస్తారని..ఇచ్చిన గడువులోపు ఓటర్లు పూర్తి వివరాలతో ఫారాల్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో సోమవారం నాటికి 75 శాతం ఓటర్లకు ఫారాల అందజేత పూర్తయిందన్నారు. 24లోపు తీసుకుంటారని తెలిపారు. సర్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు.
అన్ని ఇక్కడే.. ఓటూ ఇక్కడే
20 ఏండ్ల కిందట నగరానికి వచ్చాం. అన్ని గుర్తింపులు ఇక్కడే ఉన్నాయి. మా సొంత ఊరు కోనసీమ జిల్లా, ఉప్తలగుప్తం. 2005లో హైదరాబాద్ నగరానికి వచ్చా. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ ఇక్కడే స్థిరపడ్డాం. సాహెబ్‌నగర్‌లోని మెడికల్ అండ్ హెల్త్ కాలనీలో నివాసముంటున్నా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నా. మా పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటున్నారు. రేషన్‌కార్డు, ఆధార్ కార్డు కూడా ఇక్కడే ఉంది. కాబట్టి ఓటు కూడా ఇక్కడే ఉంచుకుంటాం. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్లో ఇక్కడ ఉండే విధంగా ఐప్లె చేసుకున్నాం. 2002లో ఆంధ్రలో ఓటు ఉన్నప్పటికీ దానితో మ్యాపింగ్ చేయించుకుని ఇక్కడ ఓటును ఉంచే విధంగా దరఖాస్తు చేసుకున్నాం.
– మధుర రాంబాబు, వనస్థలిపురం
నగరమే సౌకర్యంగా ఉంది
హైదరాబాద్‌లో 26 సంవత్సరాలుగా నివసిస్తున్నాం. మా స్వగ్రామం ఆంద్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా .ఏండ్ల తరబడి నగరంలోనే చిరు వ్యాపారంతో బతుకుతున్నందున ఓటు హక్కు వివరాలను ఇక్కడే నమోదు చేసుకుంటాం. మాకు హైదరాబాద్‌లో అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంది. నగరాన్నే సొంతూరుగా భావిస్తున్నాం. ఇక్కడే స్థిరపడ్డాం కాబట్టి ఓటు కూడా ఇక్కడే ఉంటే బాగుంటుందని భావిస్తున్నాం.
-త్రినాథ్, వ్యాపారి కృష్ణాజిల్లా
సొంతూరే మా చిరునామా
హైదరాబాద్ కేవలం ఉద్యోగం కోసం వచ్చాం. మా అన్ని వివరాలు స్వగ్రామమైన మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలనుకోవడం లేదు. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న సర్‌లో మా వివరాలను మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలోని షేర్గావ్లోనే నమోదు చేసుకుంటాం. ఎప్పటికైనా సొంత ఊరికిపోవాల్సిందే.
– మహేందర్, ప్రైవేటు ఉద్యోగి, మహారాష్ట్ర
ఉపాధికే సిటీ.. ఓటు ఊర్లోనే
మాది ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం, పట్చేవా గ్రామం. ఉపాధికోసం ఇక్కడికి 2018లో వచ్చాం. వనస్థలిపురంలోని గాయత్రీనగర్ బ్యాంకు కాలనీలో ఉంటూ మెకానిక్‌గా పని చేస్తున్నా. నా ఓటు ప్రకాశం జిల్లాలోని సొంత ఊరిలో ఉంది. ఎప్పటికైనా సొంతూరికి వెళ్లక తప్పదు కాబట్టి అక్కడే ఎస్ఐఆర్ పూర్తి చేసుకోవాలనుకుంటున్నాం. ఎస్ఐఆర్ చేసుకోవాలని ఊరి నుంచి ఫోన్ వచ్చింది. త్వరలో వచ్చి చేసుకుంటామని చెప్పాం.
– నూతలపాటి బ్రహ్మయ్య, వనస్థలిపురం
ఇక్కడే స్థిరపడ్డాం..
ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో తన ఓటు హక్కును ఇక్కడే నమోదు చేసుకుంటా. 20 ఏండ్ల కిందట మేడ్చల్‌కు కుటుంబంతో సహా వచ్చారు. స్థానికుల ఇచ్చిన సహకారంతో క్రేన్ సర్వీసు వ్యాపారంలో జీవితంలో స్థిరపడ్డాను. మేడ్చల్ సొంత ప్రాంతంగా మారింది. దూర ప్రాంతం నుంచి వచ్చిన అనే ఫీలింగ్ ఏమీ లేదు. చింతలవలసలో ఓటు హక్కును రద్దు చేసుకొని, మేడ్చల్‌లో ఓటు హక్కును నమోదు చేసుకుంటాం.
-సురేశ్, చింతలవలస, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఆంధ్రా నుంచి ఇక్కడికి మార్చుకుంటా..
నేను తెలంగాణలోనే ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణజిల్లా వైవాక ప్రాంతానికి చెందిన మేము మేడ్చల్‌కు వచ్చి స్థిరపడ్డాం. కుటుంబంతో సహా ఇక్కడే ఉంటున్నాం. ఉద్యోగం చేస్తూ ఇక్కడే స్థిరపడినందుకు మేము ఓటు హక్కును ఇక్కడే వినియోగించుకోవాలని అనుకుంటున్నాం. ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ఓటు హక్కును రద్దు చేసుకుంటాం.
-కటికాల హానీ, వైవాక, కృష్ణ జిల్లా, ఆంధ్రప్రదేశ్