సిటీబ్యూరో, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ పనితీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా… ఏ ఒక్క ఐకానిక్ ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్రను పోషించే హెచ్ఎండీఏ.. ఆ దిశగా ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా డిజైన్ చేయలేదు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత మార్చిలో రెండు ఎలివేటెడ్ కారిడార్లకు శంకుస్థాపన చేసిందే కానీ, ఇందులో ఏ పురోగతి లేదు. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏ.. మౌలిక వసతులను కల్పించాల్సి ఉన్నా… ప్రాజెక్టులను మొదలుపెట్టడం లేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఏడాదిలో హెచ్ఎండీఏ పాత్ర శూన్యంగా మారింది.
హెచ్ఎండీఏలో అభివృద్ధి ప్రాజెక్టులకు పక్కన పెట్టేశారు. గతంలో మాదిరి మోస్ట్ హ్యాపినింగ్ సిటీగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేసిన హెచ్ఎండీఏ అధికారులు… ప్రస్తుతం పెండింగ్ పనులపై దృష్టి పెట్టడం లేదు. చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నా… నివేదికలు, అధ్యయనాలతో పనులు మొదలుపెట్టడమే లేదు. ఇక అర్ధాంతరంగా నిలిచిన ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక ఏడాది ఆరంభంలోనే అందుబాటులోకి రావాల్సిన కొత్వాల్‌గూడ ఏకో పార్క్ ఇప్పటికీ నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. గతంలో ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించడంలో కాలయాపన చేస్తున్నారు. దీంతో మెట్రోపాలిటన్ నగరంలో అభివృద్ధి కుంటుపడుతున్నది.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ప్రాజెక్టుల పరిస్థితి దారుణంగా మారింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా… ప్రాజెక్టుల్లో పురోగతి లేకుండా పోయింది. కోట్లు వెచ్చించి గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేసేలా ఉన్నతాధికారులు దృష్టి పెట్టడం లేదు. కనీసం ప్రభుత్వం వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. హైదరాబాద్ టూరిజానికే తలమానికంగా నిలవనున్న కొత్వాల్‌గూడ ఏకో పార్క్ నిర్మాణంపై హెచ్ఎండీఏలో నిర్లక్ష్యం ఆవహించింది. ఓపెన్ ఎయిర్ థియేటర్, ఎంట్రెన్స్ ఆర్చ్, ఓపెన్ ప్లాజా, అప్రోచ్ రోడ్డు, ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ వంటి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం పెండింగ్ పనులపై దృష్టిపెట్టకపోవడంతో ప్రాజెక్టులకు తుది రూపం రావడం లేదు. ఇక పెండింగ్‌లోనే పలు అభివృద్ధి పనులు ఉండగా…. కొత్తగా ప్రతిపాదించిన రెండు ఎలివేటెడ్ కారిడార్లు, మీరాలం కేబుల్ బ్రిడ్జి వంటి ప్రాజెక్టులు కూడా కాగితాలకే పరిమితమైంది. వీటి డిజైన్లు అన్ని సిద్ధం గానే ఉన్నప్పటికీ… ప్రాజెక్టులపై కన్సల్టెన్సీలను నియమించి అధ్యయనం పేరిట కాలయాపన చేస్తోంది.