Cyber Crimes | సైదాబాద్, జూలై 6 : సీనియర్ సిటిజన్స్‌ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పారా వాలంటీర్ పిట్టల సత్యనారాయణ రాజు అన్నారు. సైబర్ క్రైమ్స్‌పై ఆదివారం సైదాబాద్‌లో సీనియర్ సిటిజన్‌కు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ముసుగులో అపరిచిత వ్యక్తులు వీడియా కాల్స్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. అదే విధంగా స్టాక్ ఎక్స్చేంజీలో పెట్టుబడుల పేరుతో స్టాక్, క్రిస్టో, ఫారెక్స్ వంటి పెట్టుబడి ద్వారా అతి తక్కవ కాలంలో ఆధిక లాభాలను పొందవచ్చంటూ, వాట్సాప్ డీపీ ద్వారా మీ ప్రొఫైల్ ఫోటోలను తస్కరించి వాటిని దుర్వినియోగం పరచటం ద్వారా మీ పరిచయస్తుల నుంచి డబ్బులను పొందుతూ మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. బీమా పేరుతో ఆకర్షణీయమైన నకిలీ ఇన్సురెన్స్ ఏజెంట్ల ముసుగులో కీలకమైన, అతిసున్నితమైన మీ వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టి మోసాలు చేస్తున్నారని, అలాగే పేరొందిన కంపెనీల కొరియర్ ఉద్యోగులుగా, ఎన్ఫోర్స్మెంట్ అధికారులుగా నటిస్తూ, మీ పార్సెల్స్‌లో డ్రగ్స్, మత్తు పదార్ధాలు ఉన్నాయని బెదిరించి మీ నుంచి అందింతగా దోచుకుంటున్నారని తెలిపారు.
మరి ముఖ్యంగా పరిచయస్తులుగా నటిస్తూ మీకు పరిచయం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని డబ్బులు గుంజే మోసగాళ్లుగా ఎక్కువయ్యారని, వారి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్త తరహా మోసాలకు పాల్పడే సైబర్ మోసాళ్లలపై అవగాహన పెంచుకోవాలని, అపరిచిత వ్యక్తులకు ఎటువంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వరాదని, మొబైల్ ఫోన్లలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలకు ఆకర్షితులు కావద్దని ఆయన సూచించారు. సైబర్ మోసాల బారిన పడితే, భయభ్రాంతులకు గురికాకుండా వెంటనే 1930 టోఫ్రీ నెంబర్ ఫోన్ చేసి, సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మారెడ్డి, భరత్‌సింగ్, జగన్ మోహన్ రెడ్డి, బుచ్చిరెడ్డి, సత్యనారాయణ, ఉమాదేవి, స్నేహలత, నాగమణి, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.