బన్సీలాల్ పేట్, జూన్ 28 : నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ ప్రకారం గాంధీ వైద్య కళాశాలలో ఉన్నత అధికారుల బృందం మౌలిక సదుపాయాలను పరిశీలించింది. వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా చొంగ్తు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, డీఎంఈ నరేంద్ర కుమార్, అదనపు డీఎంఈ వాణి, గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ కే ఇందిరా, వైస్ ప్రిన్సిపల్ వాల్యా, రవి శేఖర్ రావు, అన్ని విభాగాల హెచ్వోడీలు, టీజీఎంఎస్ఐడీసీ అధికారులు హాజరయ్యారు. వైద్య విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉన్న బోధనా ప్రొఫెసర్లు, సిబ్బంది, లెక్చర్ హాల్స్, లేబరేటరీలు, హాస్టల్ సదుపాయం, భద్రత, భోజన, వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జూనియర్, పీజీ వైద్య విద్యార్థుల సంఘాల నాయకులతో మాట్లాడారు. విద్యార్థుల కోసం తగిన మౌలిక వసతులు కల్పించాలని, తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్న తమకు తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం లేదని తెలిపారు. సకాలంలో స్టయిఫండ్ విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. దశలవారీగా అన్ని సమకూరుస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు.