ఉమ్మడి పాలనలో ఆ మూడు గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. ప్రజలు నిత్య సమస్యలతో సహవాసం చేశారు. కాలం గిర్రున తిరిగింది. స్వరాష్ట్రం సిద్ధించింది.ఆ ఊళ్ల సమస్యలు కండ్లారా చూసిన సీఎం కేసీఆర్ స్పందించారు. మూడు గ్రామాలను దత్తత తీసుకొన్నారు. అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు కేటాయించి, స్వయంగా పర్యవేక్షించారు. నేడు ఆ గ్రామాల దశ తిరిగి అభివృద్ధిలో పట్టణాలతోనే పోటీ పడుతున్నాయి.
మేడ్చల్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మీదుగా వెళ్తుండగా మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని కేశవరం, మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్ గ్రామాలను పరిశీలించారు. స్వయంగా వాటి స్థితిగతులను తెలుసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అంతగా తెలియని ఆ గ్రామాల్లో సీఎం కేసీఆర్ కాలుమోపారు. ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొన్నారు. మూడు గ్రామాలను దత్తత తీసుకొంటున్నట్టు ప్రకటించి, సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన అధికారులతో చర్చించి ప్రత్యేక ప్రణాళికలు రచించారు. అభివృద్ధి కార్యక్రమాల చిట్టా రూపొందించారు. సీఎం ఆదేశాలతో మూడు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.69 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో మూడు గ్రామాల్లో 112 అభివృద్ధి పనులను పూర్తి చేశారు. నేడు ఆ ఊళ్లన్నీ పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ మూడు గ్రామాల పేర్లు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
రూ.69 కోట్లతో అభివృద్ధి పనులు
కేశవరం, మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లో సీసీరోడ్లు, బీటీరోడ్లు, తాగునీటి ట్యాంకులు, అండర్‌గ్రౌండ్ డైనేజీ, పంచాయతీ భవనాలు, వైకుంఠధామాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, గ్రామ మహిళా వేదికలు (భవనాలు), మల్టిపర్పస్ ఫంక్షన్‌హాళ్లు నిర్మించారు. హరితహారం కార్యక్రమం ద్వారా పల్లె పకృతి వనాలతో గ్రామాలన్నీ పచ్చందాలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్‌కు అనుబంధ గ్రామాలుగా ఉన్న లింగాపూర్ తండా, నాగిశేటిపల్లి గ్రామాలను పంచాయతీలుగా చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాలకు మహర్దశ తీసుకొచ్చారని ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ సీఎం కేసీఆరే రావాలి
గత ప్రభుత్వాలు గ్రామాల సమగ్రాభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదు. కానీ సీఎం కేసీఆర్ అయ్యాక మా ఊరి గురించి తెలుసుకొని దత్తత తీసుకొన్నారు. పట్టణాల్లో ఉండే సౌకర్యాలన్నీ కల్పించారు. అసలు సమస్యలనేవే లేకుండా చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం మా
ఊరి అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి
ముఖ్యమంత్రే మళ్లీ రావాలని కోరుకుంటున్నాం.
– బాబాచారి, లక్ష్మాపూర్ గ్రామ పంచాయతీ
సీఎం మాట నిలబెట్టుకొన్నారు
సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మా ఊళ్లో ప్రభుత్వం అనుకున్న దానికంటే అధిక నిధులతో అన్నిరకాల సౌకర్యాలు కల్పించింది. గ్రామంలో మహిళా వేదికలు, మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లు నిర్మించి, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలతో ఊరంతా సంతోషంగా ఉన్నది.
– సింగం ఆంజనేయులు, సర్పంచ్, లక్ష్మాపూర్
ఊహించని అభివృద్ధి
మా గ్రామం ఇంత అభివృద్ధి చెందుతుందని ఊహించలేదు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైంది. గ్రామస్తులు ఎదుర్కోనే కష్టాలు తెలుసుకొన్నారు. అభివృద్ధికి అధిక నిధులు ఖర్చు చేశారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కలంగా నిధులిచ్చి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించారు.
– చిత్తాగౌడ్, రైతు, లక్ష్మాపూర్
పట్టణాన్ని మించి సౌకర్యాలు
గతంలో ఉన్న ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధినే పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకొన్న మా ఊరు నేడు సమస్యలే లేని గ్రామంగా మారింది. పట్టణాల్లో ఉండే సౌకర్యాలను మించి కల్పించారు. రోడ్లు, తాగునీటి సౌకర్యం, మహిళా భవనాలు, మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ నిర్మించారు. మళ్లీ ఇదే ప్రభుత్వమే రావాలి.
– సుధాకర్, కేశవరం గ్రామ పంచాయతీ