బేగంపేట్, మే 8 : సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు జూలై 9వ తేదీన నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం సికింద్రాబాద్ శ్రీఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయం నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి తలసాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆలయ వేద పండితులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులను మంత్రి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తుందన్నారు. ప్రతి సంవత్సరం గోల్కొండలో బోనాల ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత సికింద్రాబాద్, ఆ తర్వాత ఓల్డ్‌సిటీ బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ సంవత్సరం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు జూలై 9, 10వ తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర నలుమూలలు, నుంచి ఇతర రాష్ర్టాల నుంచి కూడా లక్షలాది మంది బోనాలకు హాజరై అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారని చెప్పారు.
ఎంత మంది వచ్చినప్పటికీ భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బోనాల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే అధికారులు, కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. అధికారులు, పాలక మండలి సభ్యులు సమన్వయంతో వ్యవహరించి ఆలయ అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో మనోహర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు అరుణగౌడ్, కిరణ్మయి, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.