కంటోన్మెంట్, జూలై 17: క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తొలి స్థానాన్ని సంపాదించుకుంది. పరిశుద్ధత, పచ్చదనం, చెత్త సేకరణ, మరెన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో కంటోన్మెంట్ బోర్డుకు మంచి గుర్తింపు పొందింది. తాజాగా జాతీయస్థాయిలో మినిస్టీ రియల్ విభాగంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుకు ఎంపికైంది.
ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ చేతుల మీదుగా కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, జాయింట్ సీఈఓ పల్లవి, నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్, బోర్డు అధికారి దేవేందర్ లు అందుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు ఎంపిక కావడానికి సేవాస్థాయి పురోగతి, నాణ్యమైన చెత్త సేకరణ, ప్రత్యేకంగా వాహనాల నిర్వహణ, పారిశుద్ధ్య పనితీరు, సర్టిఫికేషన్ విధానంతో పాటు పలు అంశాలలో తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలు భాగస్వామ్యం కావడం, వారిని చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టడం, స్వచ్ఛ యాప్ ఉపయోగించడం వంటి అంశాలు కంటోన్మెంట్ అవార్డుకు ఎంపిక కావడంలో ప్రధానంగా ఉన్నాయి.
కంటోన్మెంట్‌కు అవార్డు రావడంపై కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో బోర్డు ప్రజల ఐక్యత, వారి భాగస్వామ్యం ప్రధాన పాత్ర పోషించాయని, అభివృద్ధి, అవార్డుల్లో వారు ఎంతో స్ఫూర్తిని చాటుతున్నారని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కడంపై బోర్డు ప్రజలకు అభినందనలు తెలిపారు.