Hyderabad | హైదరాబాద్ : ఓ ఇంటి యజమాని దారుణానికి పాల్పడ్డాడు. తన ఇంట్లో కిరాయికి ఉంటున్న దంపతులను లక్ష్యంగా చేసుకున్నాడు. దీంతో వారి బాత్రూమ్ బల్బ్‌లో రహస్యంగా సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశాడు. ఈ కెమెరాను గ్రహించిన దంపతులు.. అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్‌లోని ఓ ఇంట్లో దంపతులిద్దరూ అద్దెకు దిగారు. అయితే వారి బాత్రూమ్లో బల్స్ పాడైందని, కొత్తది పెట్టాలని ఇంటి యజమాని అశోక్ అక్టోబర్ 4వ తేదీన చెప్పారు. అదే రోజు ఎలక్ట్రిషీయన్ చింటూ సాయంతో.. బాత్రూమ్లో కొత్త బల్బ్‌ను అమర్చారు.
అయితే అదే సమయంలో ఆ బల్బ్ హోల్డర్‌లో చింటూ చేత అశోక్ సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేయించాడు. అయితే ఈ నెల 13వ తేదీన కరెంట్ బల్బ్ హోల్డర్‌లో ఉన్న సీక్రెట్ కెమెరాను గుర్తించి, యజమాని అశోక్‌కు సమాచారం అందించారు. అప్రమత్తమైన అశోక్.. ఆ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను ధ్వంసం చేయడంతో పాటు కొత్తగా బల్బ్‌ను ఏర్పాటు చేశాడు.
ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఎలక్ట్రిషీయన్ చింటూ మీపై పగబట్టే అవకాశం ఉందని అశోక్ దంపతులను హెచ్చరించాడు. ఈ ఘటనను ఇంతటితో వదిలేయండి అని ఆదేశించాడు. కానీ దంపతులకు అశోక్‌పై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. చింటూ కోసం గాలిస్తున్నారు.