Hyderabad | కావురి హిల్స్ ఫేజ్- 2లో..
మాదాపూర్ కావురి హిల్స్ ఫేజ్- 2 రోడ్డులోని దాదాపు 1000 గజాల స్థలంలో ఓ వ్యాపారస్తుడు సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ వ్యాపారానికిగాను షెడ్డు నిర్మాణం చేపడుతున్నాడు. ఈ వ్యాపారస్తుడి వద్దకు జేసీబీతో వచ్చి హల్చల్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేసిన చైన్‌మెన్..చివరకు రూ.10 లక్షలకు భేరం కుదుర్చుకుని ఈ నిర్మాణ కూల్చివేత చేపట్టలేదు..ఈ తతంతాన్ని ‘నమస్తే’ కథనాన్ని ప్రచురించడంతో విచారణ చేపట్టి సంబంధిత చైన్మెన్పై జోనల్ కమిషనర్ బదిలీ వేటు వేశారు.
సంబంధిత నిర్మాణదారుడికి అప్పటికే మొదటి నోటీసు ఇచ్చిన అధికారులు ఇటీవల రెండో నోటీసు (స్పీకింగ్ ఆర్డర్) ఇచ్చారు. ఇక్కడ నోటీసులను లెక్క చేయకుండా సదరు వ్యక్తి నిర్మాణ పనులను తుది దశకు చేర్చాడు. రేపో, మాపో అధికారిక వ్యాపారానికి సిద్ధమవుతున్నాడు. నోటీసుల ఇచ్చారే తప్ప.. కూల్చివేత జోలికి వెళ్లకపోవడం అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్మాణదారుడి వెనుక సమీపంలోనే ఉన్న బిగ్ బ్రదర్ ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి.
ముషీరాబాద్ సర్కిల్ పరిధిలోని రాంనగర్ ఇండ్రస్టియల్ హౌసింగ్ కాలనీలో అక్రమ నిర్మాణంపై స్థానికుడు అనిల్‌కుమార్ ఆగస్టు 12న ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఆ సర్కిల్ ప్లానింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆ నిర్మాణం అనుమతులకు విరుద్ధంగా నిర్మించినట్లు గుర్తించి యూసీ 8026గా నమోదు చేసి ఆగస్టు 28న సదరు నిర్మాణంపై డిప్యూటీ కమిషనర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతరం నిర్మాణదారుడు 27న వివరణ ఇచ్చాడు.
ఆ వివరణ సంతృప్తికరంగా లేదని ప్లానింగ్ అధికారులు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2న స్పీకింగ్ నోటీసు 19/టీపీఎస్/డీసీ/సీఐఆర్-15 కింద నోటీసు జారీ చేసి 15 రోజుల్లో కూల్చేసుకోవాలని లేదంటే తామే వచ్చి కూల్చేస్తాం అంటూ స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసి మౌనం వహిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు నెలలు గడిచినా.. అక్రమ నిర్మాణ జోలికి వెళ్లలేదు. పనులు మాత్రం సదరు నిర్మాణదారుడు జరుపుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో సంబంధిత అధికారులపై అవినీతి అరోపణలు వెలువెత్తుతున్నాయి.
అల్వాల్ సర్కిల్ వెంకటాపురం ఇందిరానగర్‌లో సిల్ట్+2 బిల్డింగ్‌కు అనుమతి తీసుకొని సిల్ట్+4 అంతస్తులు నిర్మిస్తున్నట్లు యూసీ -7319గా ప్లానింగ్ విభాగం అధికారులు గుర్తించారు. ఈ అక్రమ నిర్మాణానికి జూలై 12న షోకాజ్ నోటీసు (యూసీ 7319/19)గా జారీ చేశారు. జూలై 26న స్పీకింగ్ నోటీసు(లెటర్ నం 68) జారీ చేశారు. అదనంగా నిర్మిస్తున్న రెండు ఫ్లోర్లను కూల్చేయాలని కూకట్పల్లి జోన్ నోడల్ అధికారికి అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ విన్నవించారు. కానీ..ఈ నిర్మాణం జోలికి వెళ్లకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం.
అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..నిబంధనలకు మించి నిర్మాణం చేపడితే నోటీసులు ఇచ్చి సదరు నిర్మాణాన్ని నేలమట్టం చేస్తాం..ఇది జీహెచ్ఎంసీ అధికారులు చెప్పే మాట..కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కాసులకు కక్కుర్తి పడుతూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు..ప్రమాదకరంగా నిర్మాణాలు జరుగుతున్నా..అనుమతులు ఇచ్చి వదిలేస్తున్నారు..కానీ సదరు అనుమతి పొందిన నిర్మాణదారుడు అనుమతులకు విరుద్ధంగా సెల్లార్లు, అదనపు అంతస్తులతో చెలరేగిపోతున్నా.. సదరు అక్రమ నిర్మాణాలను అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఫిర్యాదు చేసినా..అధికారులపై ఒత్తిడి తెచ్చినా కేవలం నోటీసులతో సరిపెడుతున్నారే తప్ప.. ఆపై చర్యలకు వెళ్లడం లేదు..ఇదే సమయంలో సదరు షోకాజ్ అందుకున్న నిర్మాణదారుడు డబ్బులిస్తే చాలు ..ఆ నిర్మాణ జోలికి వెళ్లడం లేదు..అదేమని అడిగితే సరైన ఎన్ఫోర్స్మెంట్ లేదని స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒక నిర్మాణం రాత్రి రాత్రే జరగదు..రోజుల తరబడి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా..ముడుపుల మత్తులో పడి నిబంధనలకు టౌన్‌ప్లానింగ్ అధికారులు పాతర వేస్తున్నారు.
మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 178లో పొందుపరిచిన మార్గనిర్దేశక సూత్రాలను జోనల్ కమిషనర్లు బేఖాతరు చేస్తున్నారని, టీఎస్ బీపాస్ చట్టంలోని 3(2)లోని నియమావళి ప్రకారంగా జోనల్ పరిధిలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంలకు జోనల్ కమిషనర్ నేతృత్వం వహించడం, జోనల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను నియంత్రించాల్సిన బాధ్యత తీసుకోవాల్సి ఉంది. గత కమిషనర్ లోకేశ్‌కుమార్ టీఎస్ బీపాస్ చట్టం-2020లోని సెక్షన్ 28(1) ద్వారా సంక్రమించిన అధికారాలు, నియమాలు జీవో నం. 200లోని సూత్రాలను అనుసరిస్తూ జోన్లకు 6 మంది నోడల్ అధికారులు 24 మందితో 12 ఎన్ఫోర్స్మెంట్ బృందాలను, సర్కిళ్లలోని వార్డుల ప్రకారంగా 84 మంది న్యాక్ ఇంజినీర్లతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు. ఈ టీంలు అక్రమ కట్టడాల కూల్చివేత, జరిమానాలు, సీజ్ చేయడం, పంచనామా వంటివి నిర్వర్తించాలని ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది. కానీ ఎస్టీఎఫ్ల లక్ష్యాలు పక్కదారి పట్టాయి. అవినీతి అలవాటుగా పడిన కొందరు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో కమిషనర్ ఇలంబర్తి దృష్టి సారించి ఎస్టీఎఫ్‌ను సమూల ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు.