సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : వేసవి సెలవులు ముగిశాయి. రేప టి నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇక ఎప్పటిలాగానే బడి గంటలు మోగనున్నాయి. సెలవుల్లో హాయి గా, ఆనందంగా గడిపిన చిన్నారులు ఇక భుజాన బ్యాగులు వేసుకుని బడికి వెళ్లే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పిల్లలు, తల్లిదండ్రులు ఈ విద్యా ఏడాదికి సంబంధించిన స్టేషనరీ, బ్యాగులు, టిఫిన్ బాక్స్‌లు తదితర సామగ్రి కొనుగోళ్లతో నగరంలోని స్టాల్స్ కిటకిటలాడుతున్నాయి.
మరోవైపు సర్కార్ బడులు విద్యార్థులను ఘనంగా ఆహ్వానించేలా తరగతి గదులను డెకరేషన్ చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రవాణా శాఖ పరిధిలో 12,842 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. కాగా, కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, అధిక శాతం స్కూళ్లు గురువారం ప్రారంభం కానున్నాయి.