సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : వేసవి సెలవులు ముగిశాయి. బడులు తెరుచుకోనున్నాయి. హైదరాబాద్ జిల్లాలో బుధవారం అన్నీ ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది విద్యాసంవత్సరం షురూ కానుంది. జిల్లాలో 768 పాఠశాలలు ఉన్నాయి. 1,34,476 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే అన్నీ ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, నోట్ బుక్స్ వంద శాతం పంపిణీ చేశామని హైదరాబాద్ డీఈఓ రోహిణీ తెలిపారు. యూనిఫామ్‌లను కూడా పంపించామని చెప్పారు. కాగా నాంపల్లిలోని అలియా ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఇన్చార్జి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరు కానున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన బడిబాట కార్యక్రమం జూన్ 19 వరకు కొనసాగనుంది. కాగా, పాఠశాలలు ఎప్పటిలాగానే ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు. డ్రాపౌట్లు లేకుండా పాఠశాలల్లో హాజరుశాతం పెంచడానికి పేరెంట్స్ కమిటీలు, విద్యా కమిటీలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులను భాగస్వాములను చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.అంతేకాదు ప్రతీనెల నాల్గో శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేయనున్నారు.
బస్సుల సంఖ్య పెంచండి
మహాలక్ష్మి పథకంతో ఇప్పటికే ప్రయాణికులతో బస్సులు నిండిపోతున్నాయి. ఈ ప్రభావంతో బస్సుల రాకపోకల్లోనూ ఆలస్యమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేటి నుంచి స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి. సమయానికి చేరుకోవాల్సిన విద్యార్థులకు ఇప్పుడు బస్సులో ప్రయాణం కష్టంగా మారనుందని శేఖర్ అనే విద్యార్థి తెలిపాడు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచాలని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీకి విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.