రవీంద్రభారతి, ఫిబ్రవరి14: ఎస్సీ వర్గీకరణను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా. వీఎల్ రాజు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్, సుప్రీం కోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై గల అంబేద్కర్ విగ్రహం ఎదుట శుక్రవారం పెద్ద ఎత్తున గుమికూడి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన వడ్లమూరి కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ, మెజార్టీ జనాభా ఉన్న మాలలను తక్కువ జనాభాను చూపి, వర్గీకరణ పేరుతో మాలలకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాలల ఓట్లతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాల జాతికి వెన్నుపోటు పొడిచిందని ఆయన విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో మాలల పక్షాన వర్గీకరణకు వ్యతిరేకంగా గళం ఇనిపించాల్సిన మాల మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయి మాల జాతికి మోసం చేసిన మాల ప్రజాప్రతినిధులు తక్షణమే తమ పదవులకు రాజీనామ చేసి, జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చర్యలతో మాలలతో పాటు 57 ఎస్సీ కులాలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్, ఎంఆర్పీఎస్, ఆర్ఎస్ఎస్లు రాజకీయ కుట్రలు చేసి పూర్తి స్థాయిలో దళితుల భవిష్యత్తుకు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాలమహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి సంకు శ్రీనివాసులు, పబ్బతి శ్రీకృష్ణ, నక్క దేవేందర్ రావు, బేగరి చంద్రశేఖర్, గ్రేటర్హైదరాబాద్ అధ్యక్షుడు అక్కి దాసరి రవీంద్ర బాబు, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు సీహెచ్ రోజా లీల, హేమలత, మద్దెల ప్రవీణ్ కుమార్, సుబ్బారావు, సత్యనారాయణ, సురేశ్ పాల్గొన్నారు.