బడంగ్‌పేట, ఆగస్టు 18: బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నాఊరు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు కట్టపై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని, పాపన్న జయంతిని పురస్కరించుకుని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గౌడ సంఘం నాయకులు, కల్లుగీత కార్మికులను ఈ సందర్భంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం, మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని కులాలు, మతాలను సమ దృష్టితో ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తున్నదని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో గీత వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాలలో తాటి, ఈత చెట్ల పెంపకానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం లో ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తూ గౌడ కులస్థులకు సైతం కోకాపేట ప్రాంతంలో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారన్నారు. అదే విధంగా రైతన్నల లాగే గౌడన్నలకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించిందని పేర్కొన్నారు. ఎక్కడికో వెళ్లి గీయకుండా గౌడన్నలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో చెరువు కట్టల మీదనే ఈత చెట్లు పెట్టినట్లు తెలిపారు. వాటిని కాపాడుకునే బాధ్యత సొసైటీలకే ఉన్నదన్నారు. నాడు భయం భయంగా ప్రభుత్వాల ఆంక్షల మధ్య కల్లు అమ్ముకునే వారు నేడు నగరం నడిబొడ్డున నీరా కేఫ్‌లు పెట్టి విక్రయించుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్‌లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కామేశ్‌రెడ్డి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, గౌడ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు కంటోన్మెంట్ ఒకటో వార్డు జయానగర్ కాలనీలో, బోయిన్పల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిషాంక్లు హాజరై పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సమైక్య పాలనలో పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు నాటి పాలకులకు మనసు రాలేదని విమర్శించారు. నేటి తరం పాపన్నను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో నేతలు టింకూగౌడ్, రావుల సతీష్, విజయ్, శ్రీధర్, మోని, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. – కంటోన్మెంట్, ఆగస్టు 18
చింతలకుంటలోని పల్లవి గార్డెన్లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంత్యుత్సవాల కార్యక్రమానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిత్రంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి తదితరులు
– మన్సూరాబాద్, ఆగస్టు 18
బోరబండ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న జయంత్యుత్సవాలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైట్-2 కాలనీ సర్వాయి పాపన్న గౌడ్ కమ్యూనిటీ హాల్ వద్ద పాపన్న గౌడ్ విగ్రహానికి గోపీనాథ్ శాలువా కప్పి, పూలమాల వేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల హక్కులు, సంక్షేమం కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
– ఎర్రగడ్డ, ఆగస్టు 18
కూకట్‌పల్లిలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు సత్యనారాయణ, సతీశ్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు శ్రవణ్ కుమార్, రంగారావు తదితరులు
– కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 18
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నేరేడ్మెట్ చౌరస్తాలోని పాపన్న గౌడ్ విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డితో కలిసి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హన్మంతరావు మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి పాపన్న గౌడ్ అని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేం కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్, నేరేడ్మెట్ పాపన్న గౌడ్ సేన అధ్యక్షుడు జూలకంటి సాయి కృష్ణా గౌడ్, ఉపాధ్యక్షుడు గంగిశెట్టి శ్రీధర్ గౌడ్, కాటపల్లి శ్రీధర్ గౌడ్, జూలకంటి జైరామ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అల్లాడి సాయి చందర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఎస్ఆర్ ప్రసాద్, ఉపేందర్ రెడ్డి, చెన్నారెడ్డి, యాది, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
– నేరేడ్మెట్, ఆగస్టు 18
గాజుల రామారం డివిజన్ దేవేందర్‌నగర్‌లో సర్వాయి పాపన్న గౌడ్ జయంత్యుత్సవాలకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అణగారిన వర్గాల రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయుడు పాపన్న అని ఆయన సేవలను కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు అంతా కృషి చేయాలని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు.
– జీడిమెట్ల, ఆగస్టు 18
లింగోజిగూడ గౌడ సంఘం భవనంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర కల్లు గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్, చిత్రంలో తదితరులు
– ఎల్బీనగర్, ఆగస్టు 18
కిస్మత్‌పూర్‌లోని శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ నివాసం వద్ద స్వామి గౌడ్‌తో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తదితరులు