సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): గత 6నెలలుగా వేతనాలు లేక బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్‌కు ‘జీతమో రాజనర్సింహా’ అంటూ ఆర్థికంగా తల్లడిళ్లుతున్నారు. గత ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఔట్సోర్సింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గౌరవ ప్రదమైన చదువులు చదివి, సేవా దృక్పదంతో అతి తక్కువ వేతనాలకే ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న తాము కూడా జీతాల కోసం అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేయాల్సి వస్తోందని బస్తీ దవాఖానల్లో పనిచేస్తున్న డాక్టర్లు వాపోతున్నారు. మురికి వాడలు, బస్తీల్లో జనాల మధ్య ఉంటూ నిత్యం నిరుపేదల ఆరోగ్యం కోసం శ్రమించే తమకు నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే ఎలా బతకాలని ఔట్సోర్సింగ్ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.
పేరుకు డాక్టర్ చదివాం, కాని కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని నెలల తరబడి జీతాలు అందక సకాలంలో కనీసం పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని బస్తీ దవాఖానల్లో పనిచేస్తున్న వైద్యులు వాపోతున్నారు. ఇక కిందిస్థాయిలో పనిచేసే సపోర్టింగ్ స్టాఫ్ పరిస్థితి మరీ అద్వానంగా ఉంది. నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడతో ఇంటి అద్దె చెల్లించలేకపోతున్నామని, దీంతో ఇంటి యజమానులు ఇండ్లు ఖాళీ చేయాలని వత్తిడి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
కుటుంబాన్ని పోషించుకునేందుకు అప్పులు చేస్తూ కాలం వెల్లదీస్తున్నామని, హైదరాబాద్ మహానగరంలో నాలుగు నెలలుగా జీతాలు లేకుండా ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. చెల్లించేదే తక్కువ జీతాలు, అవికూడా సమయానికి ఇవ్వకపోతే ఎలా అని వాపోతున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేక కొన్ని సార్లు పిల్లలకు అన్నం కూడా పెట్టలేని దుస్థితి నెలకొంటోందని బోరుమంటున్నారు.
వైద్యసేవలను ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రైవేటు దవాఖానలు సైతం మూతపడిన విపత్కర పరిస్థితుల్లో ఈ బస్తీ దవాఖానలే నిరుపేదలకు ఆపద్భాందవుగా నిలిచాయి. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మురికివాడలు, మారుమూల బస్తీలు, కాలనీలలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానల్లో ప్రతినిత్యం నిరుపేద రోగులకు సేవలు అందిస్తున్న సిబ్బంది జీవితాలు జీతాలు లేక దుర్బరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 500బస్తీ దవాఖానలు ఉన్నాయి. అందులో గ్రేటర్ పరిధిలోనే 410 బస్తీ దవాఖానలు ఉండగా మిగిలిన 90బస్తీ దవాఖానలు ఇతర జిల్లాల్లో ఉన్నాయి. వీటి మొత్తంలో 1500మంది సిబ్బంది పనిచేస్తుండగా వారిలో 500మంది వైద్యులు, 500మంది నర్సింగ్ సిబ్బంది, 500మంది సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు.
జీతాల కోసం కార్యాలయాలు, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. వారిని కలిస్తే వీరిని కలవండి, వీరిని కలిస్తే వారిని కలవండి అంటూ అధికారులు కాలం వెల్లదీస్తున్నారని బాధిత ఉద్యోగులు మండిపడుతున్నారు. ‘తమ వేతనాల విషయమై ఇప్పటికే జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను కలిస్తే, వారు కమిషనర్‌ను కలవాలని, కమిషనర్ కార్యాలయంలో సంప్రదిస్తే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు వెళ్లి కలవండని ఎవరికి వారు చేతులు దులుపుకుంటున్నారని బాధిత సిబ్బంది వాపోతున్నారు. అత్యవసర విభాగంలో పనిచేసే తమ జీతాల గోడుపై అటు అధికారులు గాని ఇటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి గాని పట్టించుకోవడం లేదని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు ఇప్పించాలని బస్తీ దవాఖాన సిబ్బందితో పాటు యూపీహెచ్‌సీలలో పనిచేసే సపోర్టింగ్ స్టాఫ్ కోరుతున్నారు.