Sagar Highway | యాచారం, ఫిబ్రవరి 16 : నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారి (Sagar Highway) రోడ్డు ప్రమాదాలతో రక్తసిక్తమవుతుంది. ఈ రహదారిపై తరుచూ ఏదో ఓ చోట ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఫలితంగా రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకు వాహనాల రద్దీ పేరగడం, మితి మీరిన వేగంతో ప్రయాణించడమే ప్రమాదాలకు ప్రధానణకారణంగా చెప్పవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రయాణీకులు దుర్మరణం పాలవగా.. మరెంతో మంది కాళ్లు, చేతులు పోగొట్టుకుని వికలాంగులుగా మారుతున్నారు.
సంతోషంగా గమ్యస్థానాలకు చేరుకోవల్సిన వారు డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం కారణంగా మార్గమధ్యలోనే మృత్యుఒడిలోకి జారుకుని, కుటుంబసభ్యులకు గుండెకోత మిగుల్చుతున్నారు. కుటుంబాన్ని పోషించాల్సిన పెద్ద దిక్కు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబ సభ్యులను వీధిన పడేస్తున్నారు. మాల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు సాగర్ రహదారిపై నిత్యం ఏదో ఓ చోట చిన్నచిన్న ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి.
ముఖ్యంగా మండల పరిధిలోని గున్గల్గేటు, చౌదర్పల్లిగేట్, తక్కళ్ళపల్లితండా, చింతపట్లగేట్, తక్కళ్లపల్లిగేట్, తమ్మలోనిగూడగేట్, మాల్ ప్రాంతాల్లో తరుచు ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతాల్లో గతంలో మేజర్ రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఒక్కో ప్రమాదంలో ఇద్దరు నుంచి ఆరుమంది వరకు దుర్మరణం పాలయ్యారు. దీనికి ప్రధాన కారణం డ్రైవర్ల అజాగ్రత్త. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయటమేనంటూ పలువురు పేర్కొంటున్నారు. దీంతో వారంలోనే మూడు నుంచి నాలుగు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
పెరుగుతున్న ప్రమాదాలు.
పోలీసుల నిర్లక్ష్యంతో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వాహనాలను నడపటంతోనే రోజురోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇటివలే గున్గల్ గేటు వద్ద కారు-క్రూయిజర్ డీకొనడంతో 12మంది గాయాలపాలయ్యారు. గున్గల్ క్రీడా వద్ద జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. చింతపట్ల గేటువద్ద జరిగిన ప్రమాదంలో జంగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
మాల్ వద్ద లారీ ఢీకొని ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఇలా నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరగడంతో ఏడాది కాలంగా సాగర్ రహదారిపై సుమారు 20మందికి పైగా మృతి చెందగా.. 250మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ఈ రోడ్డుపై ఇలా తరుచూ ఏదోచోట రోడ్డు ప్రమాదాలు సంభవించి, సాగర్ రహదారి తరుచు నెత్తురోడుతుంది.
అతి వేగమే కొంప ముంచుతుంది..
హైదరాబాద్-నాగార్జున సాగర్ ప్రధాన రహదారి ఇబ్రహీంపట్నం వరకు నాలుగులైన్ల రోడ్డు ఉండటం, అక్కడి నుంచి సాగర్వరకు డబుల్ రోడ్డు ఉండటంతో ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే మాచర్ల, గుంటూరు, వినుకొండ, చిలుకలూరిపేట, మార్కాపురం, పొదిలి, కనిగిరి, చీరాల, బాపట్ల, నెల్లూరు ప్రాంతాలకు అధికంగా ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు అధికంగా వెళ్తుంటాయి. క్రూయిజర్లు, కార్లు, బస్సులు, లారీలు అధికంగా రాకపోకలు సాగిస్తుంటాయి.
ఇటీవల రహదారికి వాహనాల తాకిడి మరింతగా పెరిగింది. దీంతో వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్లడంతోనే తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించడం, ఉధయం పూడ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని ప్రజలు, ప్రయాణికులు పేర్కొంటున్నారు.
సాగర్ రహదారిపై ఘోర ప్రమాదాలివే…
సాగర్-హైదరాబాద్ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదాలు గతంలో ఎన్నో చోటుచేసుకున్నాయి. తమ్మలోనిగూడెంగేటు వద్ద లారీని ఆల్టో కారు ఎదురుగా ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుమంది అక్కడికక్కడే చనిపోయారు. యాచారం సహకార సంఘం బ్యాంకు వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఐదుమంది దుర్మరణం పాలయ్యారు. గున్గల్గేటు సమీపంలో విద్యుత్ స్తంభాలను మోసుకువెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడి ఐదు మంది కార్మికులు దుర్మరణం చెందారు.
యాచారం పోలీస్స్టేషన్ వద్ద రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తక్కళ్ళపల్లి తండా వద్ద హ్యుందాయ్ కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మాల్ సమీపంలో చెట్టుకు కారు ఢీ కొన్న రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి మృతి చెందింది. ఇలా ఎంతో మంది రెప్పపాటు తేడాల్లోనే ప్రాణాలను గాలిలో కలుపుకుంటున్నారు.
ఫలితంగా తండ్రిని కోల్పోయి చిన్నారులు, భర్తలను కోల్పోయిన భార్యలు, ఈడొచ్చిన కొడుకులను కోల్పోయి తల్లిదండ్రులు జీవితాంతం దు:ఖసాగరంలోనే మునిగితేలుతున్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన వారు లక్ష్యాలను ఛేదించకుండానే హరీమంటున్నారు. కొంతమంది వికలాంగులుగా మారి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. కుటుంబసభ్యులకు, బంధువులకు గుండెకోత మిగులుస్తున్నారు. పోలీసులు అప్రమత్తమై ప్రమాదాలను నివారించటానికి కృషి చేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు.
రహదారి విస్తీర్ణం కలేనా..?
ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు సాగర్ రహదారిని 25 కిలోమీటర్ల మేర విస్తరించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆర్అండ్బీ, ఎచ్ఎండీఏ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై, రోడ్డు విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ సైతం చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ ఊసే లేదు. దీంతో సాగర్ రహదారి నాలుగులైన్ల రోడ్డుగా విస్తరించడం కలగానే మిగులనుందని ప్రజలు, ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే రోడ్డును వీలైనంత త్వరగా విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి : నరసింహరావు సీఐ, యాచారం
అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపటంతోనే ప్రమాదాలు సంభవిస్తున్నాయి, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కృషి చేస్తాం, రోడ్డు నిబందనలు, పోలీసుల నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై తగిన చర్యలు తీసుకుంటాం. అతి వేగాన్ని అదుపు చేస్తే ప్రమాదాలను నివారించవచ్చు. మద్యం సేవించి వాహనాలను నడిపేవారి పట్ల, అతివేగంగా వాహనాలు నడిపేవారి పట్ల, హెల్మెట్ లేకుండా రోడ్డు పైకి వస్తే తగిన చర్యలు తీసుకుంటాము. వాహనాల తనిఖీలు ముమ్మరం చేసి నిబందనలు ఉల్లంఘించిన వారికి తగిన చలాన్లు విధిస్తాం. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టేందుకు కృషి చేస్తాం.
Kishan Reddy | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా : కిషన్ రెడ్డి
MLA Vivekanand | ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాం : ఎమ్మెల్యే వివేకానంద్
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్