భద్రతా ప్రమాణం చేశాకే.. పనులు జరిపించండి..
కార్మికుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
ఎస్టీపీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
సమీక్షా సమావేశంలో జలమండలి ఎండీ దానకిశోర్
సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణంలో కార్మికుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జలమండలి ఎండీ దాన కిశోర్ పేరొన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఉత్పత్తయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,866.21 కోట్ల వ్యయంతో 31 కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ను జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఎండీ దానకిశోర్ సమీక్ష నిర్వహించారు. ఎస్టీపీల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులు చేస్తున్నప్పుడు కార్మికులు కచ్చితంగా రక్షణ పరికరాలను వినియోగించేలా చూడాలన్నారు. ఏ ఒక కార్మికుడికి కూడా ప్రమాదం జరగొద్దని, ప్రతి రోజూ పనులు ప్రారంభించే ముందు భద్రతా ప్రమాణం చేయించాలని సూచించారు. ఎస్టీపీ పనులు జరుగుతున్న ప్రాంగణాల చుట్టూ షటరింగ్ తప్పనిసరిగా చేయించాలని ఎండీ సూచించారు.
వేగం పెంచండి
ఎస్టీపీల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఎండీ దాన కిశోర్ ఆదేశించారు. సివిల్ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇందు కోసం కార్మికుల సంఖ్యను ఇంకా పెంచాలని నిర్మాణ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్టీపీల నిర్మాణం జరుగుతున్న ప్రాంగణాల్లో నిర్మించే కార్యాలయాలకు సంబంధించిన డిజైన్లను వారం రోజుల్లో అందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జలమండలి ఈడీ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.