బడంగ్ పేట, ఫిబ్రవరి 8: పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్‌తో పనిచేశారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవఖానను, మహిళా భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించడానికి మహేశ్వరం నియోజకవర్గంలో పది బస్తీ ధవఖానలు, 8 అర్బన్ దవఖానలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. వీటితోపాటు నగరంలో నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయల కేటాయించిందని చెప్పారు. ఒక్క సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి రూ.1200 కోట్లు ఆమె గుర్తు చేశారు. విద్య, వైద్యం అందుబాటులో ఉండడానికి గత ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా పనిచేయడం జరిగిందన్నారు. సమూలమైన మార్పులు చేయడానికి కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. బడంగ్‌పేటలో 50 పడకల దవాఖాన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పైసా ఇవ్వలేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి మంత్రులు వస్తున్నారు పోతున్నారు తప్ప ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించిన దాఖలాలు లేవని విమర్శించారు. జనరల్ ఫండ్ శంకుస్థాపనలు చేసి పోతున్నారే తప్ప నిధులు మాత్రం ఇవ్వడం లేదన్నారు. అభివృద్ధికి సహకరించకుండా ఆరోపణలకే పరిమితమవుపోతున్నారని మండిపడ్డారు. పాలన గాడి తప్పిపోయిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సిబ్బందికి కనీసం వేతనాలు ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. గతంలో సర్పంచులు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో గాని పట్టణాలలో గాని నిధులు ఇవ్వడం లేదన్నారు.
చెరువులను అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వం కృషి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటున్నదని ధ్వజమెత్తారు. అల్మాస్‌గూడలో ఉన్న చెరువుల అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయించిందని మండిపడ్డారు. చెరువును అభివృద్ధి చేస్తే స్థానికంగా ఉన్న ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో చెరువులను సుందరీ కరణ చేయడం జరిగిందన్నారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్క్ వంటివి ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. కొంతమేరకు పనులైన తర్వాత మధ్యంతరంగా పనులు నిలిపివేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. సొంత నియోజకవర్గానికి సంబంధించిన ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోతే కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌కు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.