బడంగ్ పేట్, జూన్ 30: వర్షాకాలం వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల దాహార్తిని తీర్చడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. చెరువుల సుందరీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్‌గూడలో ఉన్న చెరువు అభివృద్ధి పనులను ఆమె సోమవారం పరిశీలించారు. చెరువు చుట్టూ తిరిగి సుందరీకరణ పనులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలోనే ఈ చెరువు సుందరీకరణకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయల నిధులు కేటాయించారన్నారు. ఫైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన పనులను ఎందుకు నిలిపివేశారన్నారు. చెరువు సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్‌కు ఆమె ఆదేశాలు జారీచేశారు. కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని ప్రతి ఇంటికి అందించడానికి కోట్ల రూపాయలు కేటాయించిన విషయం ఆమె గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ట్యాంకులను నేడు సీఎం రేవంత్‌రెడ్డి అనేక చోట్ల ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. వేసవికాలం పోయి వర్షాకాలం వచ్చినా ట్యాంకులు ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్ల రూపాయలు కేటాయించారని ఆమె గుర్తు చేశారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో పూడిక తీ యించి కట్టలను డెవలప్ చేశారన్నారు. తూములు, అలుగులకు డబ్బులు కేటాయిం చి మరమ్మతులు చేయించారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చెరువులను అభివృద్ధి చేయడం ద్వారా ఎండిపోయిన అన్ని చెరువులు మత్తడి దూకాయన్నారు. పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నీటి సమస్య లేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగునీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.