బడంగ్ పేట, ఫిబ్రవరి 8: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి ఒక్కపైసా కేటాయించడం లేదని పాలన పూర్తిగా గాడి తప్పిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప లో కొత్తగా ఏర్పాటు చేసిన బస్తీ దవఖానను, మహిళా భవనాన్ని ఆమె శనివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదవారికి నాణ్యమైన వైద్యం అందించడానికి కేసీఆర్ చక్కటి విజన్‌తో అనేక ఆరోగ్య పథకాలు అమలు చేశారని అనేక వైద్య మౌలిక వసతులు ఏర్పాటు చేశారని తెలిపారు.
అందులో భాగంగానే మహేశ్వరం నియోజకవర్గంలో 10 బస్తీ దవఖానలు, 8 అర్బన్ దవఖానలు ఏర్పాటయ్యాయని వెల్లడించారు. అంతేకాకుండా నగరంలో 4 సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ఏర్పాటు చేయడానికి మాజీ సీఎం కేసీఆర్ 1200 కోట్ల రూపాయల చొప్పున కేటాయించినట్టు ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. సమూలమైన మార్పులు చేయడానికి కెసీఆర్ ఎంతో కృషి చేశారని ఆమె గుర్తు చేశారు. బడంగ్‌పేటలో త్వరలోనే 50 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయించడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహేశ్వరం నియోజకవర్గానికి మంత్రులందరూ వచ్చి పోతున్నారు తప్ప ఒక్క పైసా ఇవ్వలేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. శంకుస్థాపనలు చేసి పోతున్నారే తప్ప నిధులు మాత్రం ఇవ్వడం లేదని తెలిపారు. అభివృద్ధికి సహకరించకుండా ఆరోపణలకే పరిమితమవుపోతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాలన అంతా గాడి తప్పిపోయిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో సిబ్బందికి కనీసం వేతనాలు ఇవ్వలేకపోతున్నారని ఆమె ఆరోపించారు. గతంలో సర్పంచులు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదని అన్నారు.
చెరువులను అభివృద్ధి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అభివృద్ధిని అడ్డుకుంటున్నదని ఆమె ధ్వజమెత్తారు. అల్మాస్‌గూడలో ఉన్న చెరువుల అభివృద్ధికి 2 కోట్లు బీఆర్ ఎప్ ప్రభుత్వం కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయించిందని ఆమె మండిపడ్డారు. చెరువును అభివృద్ధి చేస్తే స్థానికంగా ఉన్న ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో చెరువులను సుందరీ కరణ చేశామని తెలిపారు. కొంతమేరకు పనులైన తర్వాత మధ్యంతరంగా పనులు నిలిపివేయడం ఎంతవరకు సమంజసం అని సబిత ప్రశ్నించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ఆమె విమర్శించారు. నియోజకవర్గానికి సంబంధించిన ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోతే కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదో సీఎం సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డి ఎం హెచ్ఓ డాక్టర్ గీత, డాక్టర్ బాలమణి, డి ఈ జ్యోతి, మాజీ ప్రజా ప్రతినిధులు ముత్యాల లలిత కృష్ణ, ఏనుగు రాంరెడ్డి, యాతం పవన్, అర్జున్, సంరెడ్డి వెంకట్ రెడ్డి, రామిడి రామ్ రెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, జంగారెడ్డి, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.