బడంగ్‌పేట, ఫిబ్రవరి 2: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ శ్రీశ్రీ హోం కాలనీలో ఆమె పర్యటించారు. ఓపెన్ జిమ్ కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని పరికరాలను పరిశీలించారు. కాలనీల్లో ఉన్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలను కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహేశ్వరం నియోజక వర్గంలో ఉన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ రూ. 375 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా తాగు నీటి సమస్య లేకుండా పోయిందన్నారు. గతంలో వారానికోసారి మంచి నీళ్లు ఇచ్చే వారన్నారు. ఇప్పుడు రోజు తప్పి రోజు వస్తున్నాయన్నారు. భవిష్యత్‌లో నీటి సమస్య రాకుండా 9 రిజర్వాయర్లు నిర్మించినట్లు చెప్పారు. చెరువులోకి మురుగు నీరు పోకుండా ఉండటానికి ఎస్ఎన్డీపీ నిధులతో నాలాల నిర్మాణానికి వంద కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు రద్దు చేయడం ద్వారా పనులు మధ్యంతరంగా ఆగిపోయిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.