చేవెళ్ల రూరల్, అక్టోబర్ 1 : స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం గులాబీ జెండా ఎగురవేసేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం చేవెళ్ల మండల పరిధి ముడిమ్యాల్ గ్రామంలోని జీకేఆర్ వ్యవసాయ క్షేత్రంలో సీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గోనె కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా సబితారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒక హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎకడికి వెళ్లినా బీఆర్ఎస్ను ఓడగొట్టి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాలో అన్ని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల స్థానాలను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఆ దిశగా నాయకులు, కార్యకర్తలు కృషి చేసి విజయం దిశగా ముందుకు సాగాలన్నారు. పార్టీ తరఫున గ్రామాల్లో ఆశావహులు ఎకువగా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు.
రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రాలేదని నిరుత్సాహపడొద్దని.. వచ్చిన వారి కోసం కష్టపడి పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ఎద్దేవా చేశారు. 22 నెలల పాలనలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన బాకీకి సంబంధించిన కార్డులను సబితారెడ్డి చూపుతూ.. కార్యకర్తలు ఈ కార్డును బ్రహ్మాస్త్రంగా వాడాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఇచ్చే బతుకమ్మ చీరలు పంపిణీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపించిందన్నారు.
మహిళలను రూ.2500 హామీ, వృద్ధులకు రూ.4000 పింఛన్, దివ్యాంగులను రూ.6 వేల పింఛన్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద తులం బంగారం, 4 ఎకరాల రైతులకు రైతు భరోసా సాయం, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీ, విద్యా భరోసా కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ ఉందని తెలిపారు. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచి మాజీ సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని సూచించారు. త్వరలో అధిష్టానంతో మాట్లాడి నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఇన్చార్జిని పెడతామని ఆమె హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికలతో పాటు భవిష్యత్‌లో జరిగే అసెంబీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ సత్తాచాటుతామనాన్నరు. కార్యకర్తలు అధైర్యపడవద్దని.. పార్టీ మీకు అండగా ఉంటుందన్నారు.
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషిచేయాలన్నారు. కష్టపడి పనిచేసేవారికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకొని ప్రచారంలో ముందుకు పోవాలని ఎమ్మెల్యే సబితారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కనీస వేతనాల సలహామండలి మాజీ చైర్మన్ నారాయణ, బీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి దేశమోళ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్‌రెడ్డి, ముడిమ్యాల్ మాజీ సర్పంచ్ శేరి స్వర్ణలత, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శశిపాల్,
దశరథ్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కెప్టెన్ అంజన్‌గౌడ్, సీనియర్ నాయకులు హన్మంత్‌రెడ్డి, శేరి రాజు, శేరి శ్రీనివాస్, శేఖర్‌రెడ్డి, ఆంజనేయగౌడ్, ఊరడి రాములు, ప్రభాకర్‌రెడ్డి, గోనె రాఘవేందర్‌రెడ్డి, రాహుల్‌రెడ్డి, కావలి శేఖర్, కావలి సుదర్శన్, మాజీ ఉప సర్పంచ్‌లు వెంకటేశ్, స్వర్ణలత, నియోజకవర్గ హరితసేన ఇన్చార్జి పూలపల్లి పృథ్వీరాజ్, బీఆర్ఎస్ నాయకులు రామస్వామి, వీరాంజనేయులు, నవీన్, రాము, ఎల్లయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.