సిటీబ్యూరో: ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ జెండా పట్టని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 14 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ నాయకుని పై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు. ఎలాంటి త్యాగం చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్యాగాలు చేసిన వ్యక్తుల గురించి మాట్లాడడం మానుకోవాలని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్రెడ్డి అడ్రస్ లేదన్నారు. ఒక ఉద్యమ నేతను పట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగుండదన్నారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నా..పట్టించుకోవడం లేదన్నారు.
ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసింది సున్నా అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే.. ఉద్యమ నేత కేసీఆర్ను విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. నోరు ఉంది కదా అని..ఇష్టానుసారంగా మాట్లాడితే.. ప్రజలు గమనిస్తున్నారన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి చెప్పారు. పాలనను గాలికి వదిలేసి విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. హామీలు నెరవేర్చడానికి అవకాశాలు లేక కేసీఆర్ను విమర్శించి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.