కందుకూరు, జనవరి 26 : అర్హులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలకు సంబంధించిన మంజూరీ పత్రాల ప్రక్రియను మండల పరిధిలోని సరస్వతీగూడ గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అర్హులకు మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వానిది గొప్పలె తప్పా.. చేసింది శూన్యమని, అర్హులకు న్యాయం చేయాలని ప్రశ్నిస్తే ప్రతి పక్షాలు అడ్డుకుంటాయని పేర్కొనడం సిగ్గుచేటన్నారు.
ఎకరం భూమి ఉన్న వారికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. గుంట భూమి ఉన్నా.. ఎంపిక చేయడం లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. తాము అధికారంలోకి వస్తే.. రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ. 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పి, వాన కాలం రైతు బంధును ఎగ్గొట్టి ఇప్పుడు ఎకరాకు రూ. 12వేలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం మాట తప్పినట్లు కాదా అని ప్రశ్నించారు. ఎన్ని సార్లు సర్వేల పేరిట కాలయాపన చేస్తారని ప్రశ్నించారు.
అర్హులైన ప్రజలందరికీ పథకాలను వర్తింప చేయకుండా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయడంపై అభ్యంతర వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాటలతో కాలం గడుతున్నదని చెప్పారు. గ్యారంటీలు ప్రతి ఒక్కరికీ అందాలన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేసి భవిష్యత్‌లో పొరపాట్లు జరుగకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సుధారాణి, ఎంపీడీవో సరిత, తహసీల్దార్ గోపాల్, మాజీ మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఏపీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, వైఎస్ చైర్మన్ గోపీరెడ్డి విజేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు రాము ముదిరాజ్, జంగయ్య, ఈర్లపల్లి భూపాల్‌రెడ్డి, గంగాపురం గోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్ తదితరులు
పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రజలతో మాట్లాడుతుండగా ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ‘జాబితాలో అర్హుల పేర్లు ఎంపిక చేయలేదు’ అని నిలదీశారు. కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్‌రెడ్డి, కల్పించుకొని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. స్పందించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రజలను రెచ్చగొట్టె అవసరం తనకు లేదని, అర్హులకు న్యాయం చేయాలని అధికారులకు సూచిస్తున్నానని చెప్పారు. దీంతో సభలో కొంత సేపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య గొడవ జరుగుతుండడంతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కల్పించుకొని ఇరు వర్గాలను శాంతింప చేశారు.