బడంగ్‌పేట, జూన్ 29: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజా సంక్షేమం కన్నా రాజకీయం ముఖ్యమైపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇందిరా రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ గ్రీన్ రిచ్ కాలనీలో ఆదివారం ఆమె పర్యటించారు. కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కాలనీ వాసులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. కాలనీలో ఇప్పటివరకు జరిగిన పనులను, ఇంకా జరగాల్సిన పనులను చర్చించారు. కాలనీలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కాలనీవాసులంతా ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని ఘనంగా సత్కరించారు. ముంపు, రోడ్ల సమస్యలు సబితా ఇంద్రారెడ్డి ద్వారానే పరిష్కరించబడ్డాయని కాలనీవాసులు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేసి కాలనీవాసులకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. ప్రజా పాలన అంటే కాంగ్రెస్ నాయకులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుడేనా అని ఆమె ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సుర్ణకంటి అర్జున్, పెద్దబావి ఆనంద్ రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రాజ్, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.