మణికొండ, జూన్ 14 : మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గుడ్‌మార్నింగ్ మణికొండ-ప్రజాభిప్రాయ సేకరణ ఆదర్శనీయమైనదని మహేశ్వరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారం కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గత కొన్నిరోజులుగా నిర్వహిస్తున్న ‘గుడ్‌మార్నింగ్ మణికొండ’-ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమ శత దినోత్సవాన్ని పార్టీ అధ్యక్షుడు సీతారాం దూళిపాళ ఆధ్వర్యంలో అల్కాపూర్ టౌన్షిప్ సెలబ్రెటీ కన్వెన్షన్ హాల్ శనివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ‘గుడ్‌మార్నింగ్ మణికొండ’ వంద రోజులు దిగ్విజయంగా ముగించుకున్న సందర్భంగా ఆమె పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. దాదాపు రెండు లక్షల పైచీలుకు జనాభా ఉన్న మణికొండ మున్సిపాలిటీలో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ సర్కారు రిజర్వాయర్లను నిర్మించిందన్నారు. నగర శివారు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 1260 కోట్ల నిధులను అప్పట్లో మంజూరు చేసి మిషన్ భగీరథ ఫేస్-2 ద్వారా తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించిందన్నారు.
కార్మికులకు రూ. 6వేల నుంచి రూ.14వేల వేతనాలను పెంచిందన్నారు. మణికొండ మున్సిపాలిటీలో ఇంటి పన్నులపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. గుడ్‌మార్నింగ్ మణికొండ-ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మహేశ్వరం నియోజకవర్గంలోనూ అమలు చేసేందుకు కృషి చేస్తామని సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమనే విషయం ప్రజలకు అర్థమైయిందన్నారు. ఓ వైపు సర్కారు వందరోజుల పండగ జరుపుతుండగా..గుడ్‌మార్నింగ్ మణికొండ కార్యక్రమంలో వేల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేస్తున్న తీరు అద్భుతమన్నారు.
ఇదే తరహాలో ప్రజల్లో బీఆర్ఎస్ శ్రేణులు సంపూర్ణ విశ్వాసాన్ని కల్పించాలన్నారు. ‘తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుకు కాలం చెల్లింది..పరిపాలన అటకెక్కింది. మళ్లీ రాష్ట్రంలో కేసీఆర్ పాలన వస్తేనే మనందరి జీవితాలు బాగుపడతాయని ప్రజలు నిర్ణయించుకున్నారు. వారందరికీ అండగా గులాబీ జెండా ఉండాల’ని రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి అన్నారు.
మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక సలహాదారు, ఆఫీషియల్ స్పోక్‌పర్సన్‌గా ఉపేంద్రనాథ్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా అందె లక్ష్మణ్‌రావు, ఏర్పుల శ్రీకాంత్, కార్యనిర్వాహక కార్యదర్శిగా రామసుబ్బారెడ్డి, కార్యదర్శిగా ఖలీం, మైనార్టీ విభాగం ప్రతినిధిగా షేక్ ఆరీఫ్, కార్యదర్శిగా ఉప్పర అశోక్ కార్యవర్గంలో బాధ్యతలు కేటాయించారు. కార్యక్రమంలో నార్సింగి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.విష్ణువర్ధన్‌రెడ్డి, మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు రూపారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఉపేంద్రనాథ్‌రెడ్డి, శ్రీకాంత్, మల్యాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు.