Rythu Bharosa | మేడ్చల్, మార్చి8 (నమస్తే తెలంగాణ): రైతు భరోసా పథకంపై రైతులు నమ్మకం కొల్పోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో యాసంగిలో 14, 300 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది. అరకోర రైతులకు ఇచ్చే రైతు భరోసానైన సకాలంలో అందిస్తారనుకుంటే అదిలేదు అంటూ రైతులు వాపోతున్నారు. యాసంగిలో 14,300 ఎకరాలకు రైతు భరోసా అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు 6,410 మంది రైతులకు మాత్రమే రైతు భరోసాను అందించగా మిగతా రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లాలో 40,960 మంది రైతులకు ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలలో 82 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. యాసంగిలో 14,300 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తుంటే మిగతా 64 వేల పైచిలుకు ఎకరాలకు రైతు భరోసాను ప్రభుత్వం కట్ చేసినట్లయింది.
జిల్లాలో 64,794 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించినా.. యాసంగిలో మాత్రం 14,300 ఎకరాలకు మాత్రమే రైతు భరోసాను అందించడపై రైతులు విస్మయానికి గురవుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి రూ. 12 వేలు రెండు దశల్లో చెల్లించాలని తీసుకున్న నిర్ణయం సరిగా అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 79,844 ఎకరాలకు రైతుబంధు పథకాన్ని అందించారు. 81 వేల ఎకరాల వ్యవసాయ భూములకు పంట పెట్టుబడి సాయం కింద 48,072 మంది రైతులు ఉండగా రైతుబంధు పథకం కోసం బ్యాంకు ఖాతాలు పొందుపరచిన 35,877 రైతులకు సీజన్ల వారీగా రూ. 33 కోట్ల 25 లక్షలు రైతుబంధును రైతుల ఖాతాలలో జమ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు అన్ని రకాలుగా ఇబ్బందులు ఏర్పాడుతున్నాయని పేర్కొంటున్నారు. అర్హూలైన రైతులందరికి రుణమాఫీ అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన రుణమాఫీ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 3,600 మంది రైతులకు మాత్రమే మాఫీ జరిగిందన్నారు. రుణమాఫీ మాఫీ వర్తింజేయాల్సిన రైతులు ఆందోళన చేసిన ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.