సిటీబ్యూరో, దుండిగల్ : నిజాంపేట పరిధిలో వందల కోట్ల విలువైన సర్కార్ భూమిపై కొందరు అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఆ భూమిని నొక్కేసేందుకు స్కెచ్ వేశారు. 12 ఎకరాల సర్కార్ స్థలాన్ని కబ్జా చేసేందుకు సొసైటీ ముసుగులో ఎంట్రీ ఇచ్చారు. ఈ పన్నెండు ఎకరాలకు సంబంధించి అసైన్డ్ చట్టం వర్తించదని హైకోర్టు తీర్పును చూపిస్తూ.. సదరు ప్రైవేట్ వ్యక్తులు సంబంధిత భూములను చదును చేస్తూ.. వాణిజ్య కార్యకలాపాలను సిద్ధమవుతున్న వేళ.. రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. వివాదాస్పదంగా మారిన ఈ భూములపై కోర్టులలో ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా బాచుపల్లి తహసీల్దార్ పర్యటించి కలెక్టర్‌కు కీలక లేఖ రాశారు. సర్వే నంబర్లు 233/24, 233/25, 233/26 లలో గల సుమారు 12 ఎకరాల 01 గుంటల భూమికి సంబంధించి న్యాయపరమైన పోరాటాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లాలని తహసీల్దార్ తన నివేదికలో స్పష్టం చేశారు.
బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామ పరిధిలోని సదరు సర్వే నంబర్లలో గల 112 ఎకరాల 27 గుంటల భూమి గతంలో పోరంబోకు సరారీ (ప్రభుత్వ భూమి)గా వర్గీకరించబడింది. ఉమ్మడి మెదక్ తాలూకా తహసీల్దార్ కాలంలో ఇందులో కొంత భూమికి పట్టాలు జారీ కాగా, 1962-63 లో లావణి ఇజాఫా కింద మంజూరు చేశారు. అయితే, 1993 లో జారీ చేసిన సప్లిమెంటరీ సేత్వార్ ప్రకారం.. 12 ఎకరాల 01 గుంటల భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నట్లు రికార్డు అయింది. గతంలో సీతారాం రెడ్డి, ఎల్లారెడ్డి, రామకృష్ణారెడ్డి అనే అసైనీల పేరుతో ఉన్న ఈ భూమిని శ్రీనివాస హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు క్రమబద్ధీకరణ చేయాలని కోరారు.
అయితే అది నిబంధనల ప్రకారం వర్తించకపోవడంతో 2010 మార్చి 10న అప్పటి కూకట్ పల్లి తహసీల్దార్ అసైన్డ్ భూముల చట్టం (పీవోటీ) 1977 ప్రకారం ఈ భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ స్వాధీన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జి. అమృతారావు మరికొందరు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2011 సెప్టెంబర్ 14న హైకోర్టు ధర్మాసనం ఈ భూములకు అసైన్డ్ చట్టం వర్తించదని పేరొంటూ ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. దీనిపై అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు 2014లో హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేశారు. అయితే ఈ అప్పీల్ దాఖలు చేయడంలో 723 రోజుల సుదీర్ఘ ఆలస్యం జరిగింది.
ఆలస్యానికి సరైన కారణాలను చూపకపోవడంతో హైకోర్టు ఈ ఏడాది (2026) మార్చి 17న ప్రభుత్వ అప్పీలును, డిలే కండోనేషన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తుది తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సదరు భూములు ప్రైవేటు పట్టా భూములుగా స్థిరపడ్డాయని, అందువల్ల రెవెన్యూ అధికారులు ఎలాంటి క్షేత్రస్థాయి అడ్డంకులు సృష్టించవద్దంటూ శ్రీనివాస హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ వరింగ్ ప్రెసిడెంట్ నిఖిల్ నాదం ప్రభుత్వానికి ప్రాతినిధ్యం సమర్పించారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలించిన బాచుపల్లి తహసీల్దార్ ఏప్రిల్ 6, 2026 న మలాజిగిరి ఆర్డీఓకు సమగ్ర నివేదికను పంపారు.
కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండాలంటే, వెంటనే తెలంగాణ అడ్వకేట్ జనరల్ ద్వారా ఈ కేసును పునఃసమీక్షించాలని సూచించారు. హైకోర్టు తీర్పుపై రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం లేదా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రభుత్వ భూమిని కాపాడటానికి తక్షణమే తదుపరి చర్యలు చేపట్టాలని తహసీల్దార్ ఆ లేఖలో కోరారు. కాగా, అమృతా రావు వర్గం మాత్రం ఈ భూములను అసైన్డ్ చట్టం వర్తించదని న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నాయని, పూర్తి హక్కులు తమవేనని.. ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని చెబుతున్న దరిమిలా ఈ స్థలంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
నిజాంపేటలోని సర్వే నంబరు 233/24, 233/25, 233/6లోని 12 ఎకరాల ప్రభుత్వ లావాణి భూములకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులతో మండల రెవెన్యూ అధికారుల తరపున సవాల్ చేస్తూనే ఉన్నాం. 2012 లోనూ ఓ సారి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతుగా కోర్టు ఆర్డర్స్ ఇటీవలే మరోసారి గత మార్చి 17న హైకోర్టు డివిజన్ బెంచ్ సదరు భూములను ప్రభుత్వ అసైన్ భూములుగా నిరూపించకపోయిందని పేర్కొంటూ.. జి. అమృతరావు, మరో ఐదుగురుకి మద్దతుగా తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం తరపున భూమిని కాపాడేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కి నివేదిక అందజేశాం.
– వాణిరెడ్డి, తహసీల్దార్