సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో బస్సుల సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు. విద్యాసంస్థల ప్రారంభానికి ముందు ఏప్రిల్, మే నెలల్లో ప్రజా సంఘాలు, విద్యార్థులు కలిసి లక్ష సంతకాల క్యాంపెయిన్ ప్రారంభించారు. బస్సులు పెంచాలని డిమాండ్ చేశారు. క్యాంపెయిన్ రిపోర్ట్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందించారు. కానీ ఇప్పటి వరకు బస్సుల సంఖ్య పెంచలేదు. కానీ సామాన్యులు ప్రయాణం చేయాలంటే భయపడేలా టికెట్ ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ పై కిలో మీటర్లపై రూ.5, రూ.10 పెంచడాన్ని విమర్శించారు. గ్రేటర్ జోన్ పరిధిలో ఆర్టీసీ నడుపుతున్న సిటీ బస్సులో రోజు 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. నగర శివార్లకు వెళ్లాలంటే కూడా బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు సరిపడా బస్సులు నడపాలి..
శివార్ల నుంచి నగరంలో పలు ప్రధాన మార్గాలకు బస్సులు నడపాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆదిబట్ల, దుండిగల్, మోకీల,శంకర్పల్లి, కొల్లూర్ నియోపాలిస్ సమీపంలోని ప్రాంతాలకు అరకొర బస్సులు కాకుండా సరిపడా నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. గండిమైసమ్మ నుంచి ప్రగతినగర్ మీదుగా బస్సు నడపాలని ఇప్పటికే ఆర్టీసీకి విజ్ఞప్తి పత్రాలు అందించారు. గండి మైసమ్మ మార్గంలో రాంపల్లి, దమ్మాయిగూడ, బాలాజీనగర్‌కు బస్సులు నడపాలని ఉద్యోగులు, విద్యార్థులు కోరుతున్నారు. అయితే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఆర్టీసీ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్లో బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఇప్పటికే ఉంది. కోటి జనాభా దాటిన మాహానగరంలో సుమారు 7వేల బస్సులు ఉండాలని నిపుణులు సూచించారు. కానీ ఇప్పుడు కేవలం 2700 బస్సులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి.
టికెట్ ధరలు పెంచడం సరైనది కాదు. ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలి. నగరంలో బస్సులు సరిపడా లేవు. గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి ఉంది. బస్సులు లేకపోవడం కారణంగా వచ్చిన బస్సులన్నీ రద్దీగా వస్తున్నాయి. బస్సుల సంఖ్య పెంచాలని కోరుతూ లక్ష సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టాం. రిపోర్ట్‌ను ఎండీ సజ్జనార్‌కు అందించాం. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు.
– వరలక్ష్మి, ఐద్వా, హైదరాబాద్ సెంట్రల్ సెక్రటరీ