Hyderabad | దుండిగల్, ఏప్రిల్ 5: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న మోడీ లోకి దిగడంతో ముందు చక్రాల ఎక్సెల్ విరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు టైర్లు రెండు ఊ డిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆర్టీసీ బస్సును జెసిబి తో పక్కకు జరిపారు.
మియాపూర్-2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 11 జెడ్ 6989) సర్వీస్ నెంబర్ 191 శనివారం సాయంత్రం బాచుపల్లి నుంచి నగరంలోని వేగురాకు బయల్దేరింది. బాచుపల్లిలోని రాజీవ్‌గాంధీ నగర్ మూల మలుపు వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న డ్రైనేజీ కాల్వలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఎక్సెల్ విరగడంతో ఒక్కసారిగా ముందటి రెండు చక్రాలు ఊడిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం గురించి తెలియగానే ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా రోడ్డుపై నిలిచిన బస్సును జేసీబీ సాయంతో పక్కకు జరిపించారు.