సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ) : ఆర్టీఏ కార్యాలయాల్లో కొందరి అధికారుల అండతో ఏజెంట్ల ఆగడాలు పేట్రేగిపోతుండటంతో ఉన్నతాధికారులు సీసీ నిఘాపై దృష్టి సారించారు. ఇటీవల ఏసీబీ సోదాలతో రంగారెడ్డి మణికొండ, కొండాపూర్, మేడ్చల్ కార్యాలయాల్లో అంతా ఏజెంట్లే చక్రం తిప్పుతూ పనులకో రేటు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇష్టానుసారంగా జారీ చేయించడం, ఆర్సీ, లైసెన్స్ కార్డులు నేరుగా ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లడం, ఇతర ఫిట్నెస్ పరీక్షలకు క్లియరెన్స్ ఇప్పించడం తదితర అక్రమాలను ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో గతంలోనే ఇలాంటి ఏజెంట్ల దందాను తుడిచిపెట్టేందుకు సీసీ కెమెరాలను అధిక సంఖ్యలో ఏర్పాటుకు రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తొలుత ఖైరతాబాద్‌లో 8 కెమెరాలను అదనంగా ఇన్స్టాల్ చేశారు. ఈ కెమెరాలతో ప్రయివేట్ వ్యక్తులు రావడం, ఒకే వ్యక్తి ఎన్ని సార్లు వచ్చారు? తదితర డేటాతో గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఈ తరహా కెమెరాలను నగరంలోని అన్ని కార్యాలయాల్లో ఇన్స్టాల్ చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. కానీ ఆ ప్రక్రియ ఖైరతాబాద్తోనే ఆగిపోయింది. మిగిలిన కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ అధికారులు మరిచారు. తాజాగా, మళ్లీ ఏసీబీ సోదాలతో ఏజెంట్ల ఆగడాలు బహిర్గతమయ్యాయి.
దీంతో రవాణా శాఖ ఉన్నతాధికారులు మేల్కొన్నారు. మేడ్చల్, రంగారెడ్డి కార్యాలయాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసి సెంట్రల్ కార్యాలయం నుంచే పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేస్తామని ఓ అధికారి తెలిపారు. ఇకపై అన్నీ ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రయివేట్ వ్యక్తులెవ్వరినీ లోపలికి అనుమతించబోమని చెప్పారు. ఎవ్వరి పేరుతో స్లాట్ బుక్ అవుతుందో..వారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని చెప్పారు. ప్రతీ ఆర్టీఏ కార్యాలయంలో అదనంగా 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.