KTR | సింగరేణిలో అవినీతి వెలికితీశాక పాలకుల్లో వణుకు మొదలైందని.. తాము సోలాం పవర్ స్కాం గురించి కూడా బయటపెట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు బొగ్గు గనుల కేటాయింపులపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేశారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్‌కు రెండున్నర నుంచి మూడు కోట్లలో నేడు సోలార్‌లో నిర్మాణం జరుగుతుంది. కానీ తెలంగాణలో సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం రూ.7 కోట్లట.. దేశం మొత్తంలో 2, 3 కోట్లలో అయ్యేది ఒక్క తెలంగాణలోనే రూ.7 కోట్లు ఎందుకు అవుతుంది.. ఇది సోలార్ పవర్లో స్కాం కాదా అని మేం నిలదీస్తే ఇంతవరకు సమాధానం లేదని ప్రశ్నించారు. అలాగే గనుల్లో వాడే పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్ 30 శాతం అదనంగా రేటు పెంచారు.. ఎందుకు పెంచారని అడిగితే సమాధానం లేదన్నారు.
చివరికి సింగరేణిలో ఒక డైరెక్టర్ జీవీ రెడ్డి, డైరెక్టర్ వీకే శ్రీనివాస్.. ఈ ఇద్దరూ కూడా ఈ 30 శాతం అదనంగా ఎందుకు పెడుతున్నారు. ఖర్చు ఇంత పెట్టాల్సిన అవసరం లేదు. జిలెటిన్ స్టిల్స్, పేలుడు పదార్థాల మీద 30 శాతం ఎందుకు పెంచారని డైరెక్టర్లు బోర్డులో నిలదీస్తే వాళ్ల మీద చర్యలు తీసుకున్నారు తప్ప కాంట్రాక్టర్లను లాభం చేసే పనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనకకు తగ్గలేదు.. ఇది వాస్తవమా..? అని మేం నిలదీస్తే సమాధానం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అన్ని విషయాలు ఇవాళ గవర్నర్ దృష్టికి సవివరంగా తెచ్చాం. బెదిరించి కాంట్రాక్టర్లను ఒక రింగు చేసి ప్రజాధనాన్ని.. ప్రజాధనం ఎందుకంటే సింగరేణి కాలరీస్ అనే సంస్థలో 51 శాతం ఓనర్షిప్ తెలంగాణ ప్రభుత్వానిది.. 49 శాతం ఓనర్షిప్ కేంద్రప్రభుత్వానిది. మరి ప్రభుత్వాలది అన్నప్పడు ఈ సొమ్ము మొత్తం ప్రజలదే.. సింగరేణి కార్మికులదేనన్నారు.
బావమరిదికి సింగరేణిని గుత్తకు రాసిచ్చిండు..
ఈ కోల్‌బెల్ట్‌లో ఉండే మా కార్మిక సోదరులు ఆలోచన చేయాలి. వేల కోట్ల రూపాయలు ఏ రకంగా ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నదో.. దీనిపై మేం ఎన్నిసార్లు అడిగినా సమాధానం రావడం లేదన్నారు. వాస్తవేమేంటంటే అన్నదమ్ముళ్లు దోచుకున్నది రేవంత్‌రెడ్డికి సరిపోవడం లేదట. హిల్ట్ కుంభకోణం పేరు మీదు హైదరాబాద్‌లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి 5 లక్షల కోట్ల విలువ చేసే 9200 ఎకరాల భూమిని కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటకు తీసుకొచ్చింది. అన్నదమ్ముళ్ల దోపిడీని అడ్డుకున్నది. కానీ రేవంత్ రెడ్డికి అన్నదమ్ముళ్ల దోపిడి సరిపోవడం లేదట. ఇప్పుడు బావమరిది కండ్లలో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండని కేటీఆర్ ఆరోపించారు.