హైదరాబాద్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో భారీగా నగదు పట్టుబడుతున్నది. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని (Hyderabad) రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు కూకట్‌పల్లిలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ బైక్‌లో రూ.53.5 లక్షలు తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడ్డ డబ్బుకు వాహనదారుడు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరిని అరెస్టు చేశారు. డబ్బును, బైక్‌ను సీజ్ చేసి కేసు నమోదుచేశారు. నగదును ఎక్కడి నుంచి తెస్తున్నారు.. ఎవరి కోసం తీసుకెళ్తున్నారు, ఎవరిచ్చారనే విషయాలను తెలుసకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో భారీగా డబ్బు (Cash Seized) పట్టుబడింది. జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీచేశారు. దీంతో ఓ లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు పట్టుబడ్డాయి. ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేశారు. అక్రమంగా డబ్బును తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు.