Hyderabad | బంజారాహిల్స్, మే 27 : వీసా ఇంటర్వ్యూలో సాయం చేస్తానంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న కాసా ప్రణయ్ యాదవ్ అనే యువకుడు అమెరికాలోని రూట్జర్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు ఇటీవల వీసా దరఖాస్తు చేసుకున్నాడు. సయ్యద్ బషీర్ అనే వ్యక్తిని కన్సల్టింగ్ సంస్థ నియమించింది.
కాగా వీసా ఇంటర్వ్యూలో సాయం చేస్తానని, వీసా అధికారులతో మాట్లాడి ఒకే ఒక ప్రశ్న అడిగేలా చూస్తానంటూ బషీర్ నమ్మబలికాడు. దీనికోసం రూ.30 వేలు తీసుకున్నాడు. అయితే వీసా ఇంటర్వ్యూలో ఏకంగా ఏడు ప్రశ్నలు వేయడంతో పాటు వీసా దరఖాస్తును రిజెక్ట్ చేశారు. దీంతో తనవద్ద డబ్బు తీసుకుని మోసం చేశాడంటూ బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.